ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష

Indonesia Parliament Passes New Criminal Code Bans Extra Marital Sex - Sakshi

వివాహేతర సంబంధాలు, ఇతర లైంగిక చర్యలపై శిక్షలు ఖరారు

నేర శిక్షాస్మృతి సవరణ బిల్లుకు ఇండోనేసియా పార్లమెంట్‌ ఆమోదం 

జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్‌లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు.

పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు.

ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top