భారత్‌కు సాయం చేస్తాం: పాక్‌ ప్రధాని

Imran Khan Expresses Solidarity With India Over COVID19 Situation - Sakshi

మార్గాలను అన్వేషిస్తున్నాం: అమెరికా 

భారత్‌ ప్రజల వెంట ఉంటామన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌

వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌: భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తూ ఉండడంతో అమెరికా సహా ఎన్నో దేశాలు సాయం అందించడానికి ముందుకు వచ్చాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు కరోనా వ్యాక్సిన్‌తో పాటు, ప్రాణాలను నిలబట్టే వైద్య సామాగ్రి పంపాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అగ్రరాజ్యంలో భారతీయ ప్రముఖులు, బైడెన్‌ పాలకమండలిలోని భారతీయులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న భారత్‌ను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ లో ప్రజలపై అమెరికాకు ఎంతో సానుభూతి ఉంద ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి చెప్పారు. కరోనా సంక్షోభ నివారణ కోసం ఎలా సాయపడవచ్చో భారత్‌ అధికారులతోనూ, రాజకీయ నాయకులతోనూ, ఆరోగ్య నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్టుగా శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. భారత్‌కు వ్యాక్సిన్‌ సహకారం అందించడమే తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని చెప్పారు.

‘‘కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటినుంచి భారత్‌కు సాయం అందిస్తూనే ఉన్నాం. వెంటిలేటర్‌ వంటి మెడికల్‌ పరికరాలతో పాటు కరోనాని ఎదుర్కోవడంలో ఆరోగ్య సిబ్బంది కి శిక్షణ ఇచ్చాం. అంతేకాకుండా భవిష్యత్‌లో ఆరో గ్య సంబంధ విపత్తులను, ప్రస్తుత కరోనాని ఎదు ర్కోవడం కోసం 140 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించాం’’అని ఆమె వివరించారు.  భారత్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చీఫ్‌ మెడికల్‌ అడ్వయిజర్‌ డాక్టర్‌ ఆంటోని ఫౌచీ అన్నారు. ప్రపంచం లో మరే దేశంలో లేని విధంగా కేసులు భారత్‌ లో వస్తున్నాయని, భారత్‌ ప్రజలకి వ్యాక్సినేషన్‌ అం దించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.  

కరోనాపై సమష్టి పోరాటం: ఇమ్రాన్‌ఖాన్‌ 
కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్‌ ప్రజలకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంఘీభావం ప్రకటించారు. ప్రపంచ దేశాలకే సవాల్‌గా మారిన కరోనాపై మానవాళి సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మా పొరుగుదేశంతో పాటుగా ప్రపంచదేశాల్లోని ప్రజలందరికీ కరోనా నుంచి విముక్తి రావాలంటూ ట్వీట్‌ చేశారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న భారత ప్రజలందరి వెంట తాము ఉంటామని ఇమ్రాన్‌ చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top