అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా | Global Media Stunned BJP Conquers Bengal Vijay Sweeps Tamil Nadu | Sakshi
Sakshi News home page

అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా

May 5 2026 11:51 AM | Updated on May 5 2026 11:59 AM

Global Media Stunned BJP Conquers Bengal Vijay Sweeps Tamil Nadu

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్‌లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.

బెంగాల్‌లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యం
ప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్‌ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని  పేర్కొంది.

అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలు
అమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.

పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..
భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్‌ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.

ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి..
 

Advertisement
 
Advertisement
Advertisement