
కీవ్: ఉక్రెయిన్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఆండ్రీ పరుబియ్ గుర్తు తెలియని దుండగుడి కాల్పుల్లో మృతి చెందారు. నగరంలోని ఫ్రాంకివ్‌స్కీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఆండ్రీ పరుబియ్ హత్యను దారుణ ఘటనగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివర్ణించారు. హంతకుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయన్నారు.
2013–14 మధ్య జరిగిన యూరో మైదాన్ ప్రజా ఉద్యమంలో ఆండ్రీ పరుబియ్ కీలకంగా వ్యవహరించారు. ప్రజా ఉద్యమాల వల్లే అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిచ్ దేశం విడిచి పారిపోవడం, క్రిమియాను రష్యా ఆక్రమించుకోవడంతోపాటు రష్యా సరిహద్దు ప్రాంతాల్లో అంతర్యుద్ధం మొదలయ్యాయి.
రష్యా మళ్లీ తీవ్ర దాడులు
ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భారీ దాడులకు పాల్పడింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఏకంగా 537 డ్రోన్లు, 45 వరకు క్షిపణులను ప్రయోగించింది. జపొరిఝియా ప్రాంతంపై జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా పలువురు చిన్నారులు సహా డజన్ల కొద్దీ పౌరులు గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.