ఇరాన్‌పై ట్రంప్‌ గేమ్‌ ప్లాన్‌ మారింది..! | With Dutch Royals Dinner: Trump Reveals His Plan To End Iran War | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై ట్రంప్‌ గేమ్‌ ప్లాన్‌ మారింది..!

Apr 16 2026 4:31 PM | Updated on Apr 16 2026 4:48 PM

With Dutch Royals Dinner: Trump Reveals His Plan To End Iran War

ఇరాన్‌తో అంత ఈజీ కాదనే విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు పదే పదే బోధపడుతూనే ఉంది.  ఇటీవల పాకిస్తాన్‌లో ఇరాన్‌తో జరిపిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ట్రంప్‌కు ఈ విషయం బాగానే అర్థమైంది. బెదిరింపులతో ఇరాన్‌ను దారి తెచ్చుకోవాలనుకుంటే ఏదీ కూడా వర్కౌట్‌ కావడం లేదు కాదు కదా.. కనీసం మిత్ర దేశాల సహకారం కూడా లభించడం లేదు. 

దాంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇరాన్‌ను యుద్ధంతో వశపరుచుకోవడం వల్ల కాదు అనుకున్నారో  ఏమో కానీ ట్రంప్‌ మాత్రం తన రూట్‌ మార్చుకున్నారు. ఇప్పటివరకూ సర్వనాశనం అంటూ ఇరాన్‌పై  యుద్ధభేరీ మోగిస్తూ వచ్చిన ట్రంప్‌..   ప్రస్తుతం ఆర్థిక యుద్ధ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇరాన్‌తో యుద్ధాన్ని పక్కకు పెట్టి వారిపై ఆర్థిక ఒత్తిడి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. గత రాత్రి వైట్‌హౌస్‌లో డచ్‌ రాజు, డచ్‌ రాణిలతో జరిగిన ప్రైవేట్‌ డిన్నర్‌ కార్యక్రమంలో ఇదే విషయాన్ని ట్రంప్‌ చెప్పినట్లు సమాచారం. 

ఇరాన్ యుద్ధాన్ని త్వరితగతిన ముగించడానికి టెహ్రాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఏకైక మార్గమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో ఇరాన్‌తో జరిగిన మొదటి విడత చర్చలు చేదు అనుభవంతో ముగిసిన తర్వాత,తి రిగి చర్చలను మళ్లీ  పట్టాలు ఎక్కించాలంటే కచ్చితంగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచడమే ఒక్కటే మార్గమని ట్రంప్‌ ఓ స్పష్టతకు వచ్చారని, ఇదే విషయాన్ని డచ్‌ రాజు విల్లెం-అలెగ్జాండర్, రాణి మాక్సిమాలకు చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. 

ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అనేది అత్యంత ఆందోళనకరమని, ఇది మరొక ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉండటంతో డచ్‌ ప్రభుత్వం.. యుద్ధంలో అమెరికాకు సహకరించడానికి నిరాకరించింది. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హర్మూజ్‌ జలసంధి విషయంలో ఓ స్పష్టతకు రావాలని, అందుకు ఇరాన్‌తో చర్చలు అవసరమని డచ్‌ ప్రభుత్వ ప్రతినిధులు.. ట్రంప్‌కు చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక  ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడమే ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సైనిక దాడులకన్నా ఆర్థిక యుద్ధం మీద దృష్టి పెట్టడమే సరైనదిగా ట్రంప్‌ యోచిస్తున్నారు. 

దీనిలో భాగంగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడానికి ప్రధానంగా చమురు ఎగుమతులను అడ్డుకోవడం, బ్యాంకులపై ఆంక్షలు విధించడంతో, మరియు నావికాదళ నిర్బంధం వంటి వ్యూహాలను ఉపయోగించి వారిని కట్టడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement