అందుకే కుక్కలు రెచ్చిపోతున్నాయి: హార్వర్డ్‌ స్టడీలో వెల్లడి

Dog Bite Risk Surge due to Climate Change - Sakshi

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కుక్కకాటు సంఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇదే విషయానికి సంబంధించిన పరిశోధనలలో ఒక ఆందోళన కలిగించే రిపోర్టు బయటకువచ్చింది. దాని ప్రకారం శునకాల ప్రవర్తన వాతావరణ మార్పులకు అనుగుణంగా మారుతుందని పేర్కొన్నారు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సాగించిన ఈ పరిశోధనలో వాతావరణంలో వేడి, అల్ట్రావైలెట్‌(యూవీ) స్థాయి పెరిగినప్పుడు శునకాలు మనుషులకు శత్రువులుగా మారుతాయని తెలిపారు. ఈ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. 

హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ 70 వేలకు పైగా డాగ్‌ బైట్స్‌కు సంబంధించిన ఘటనలపై అధ్యయనం చేసిన అనంతరం ఒక ఆందోళనకర ట్రెండ్‌ను గుర్తించింది. వేడివాతావరణంలోను, పొల్యూషన్‌ కలిగిన వాతావరణంలోనూ శునకాలు మనుషులపై దాడులకు దిగుతాయని వారి పరిశోధనలో తేలింది. మానవుల తప్పిదాల కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగిపోతోంది. దీని ప్రభావం శునకాలపైన కూడా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

నేచర్‌ జర్నల్‌ ఈ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ను జూన్‌ 15న ప్రచురించింది. అమెరికాలోని 8 ప్రముఖ నగరాల్లో ఈ పరిశోధన 10 ఏళ్లపాటు కొనసాగింది. వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లోను, కాలుష్యం అధికంగా ఉన్న రోజుల్లోనూ శునకాలు హింసాత్మకంగా మారడం కనిపించింది. 

ఈ పరిశోధనలో ప్యాట్రన్‌ను గమనిస్తే యూవీ లెవెల్‌ పెరుగుతున్న కొద్దీ కుక్క కాట్లు 11 శాతం పెరుగుతూ వచ్చింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న రోజుల్లో ఇది 4 శాతం మేరకు పెరిగింది. ఓజోన్‌ లెవెల్‌ అధికంగా ఉన్న రోజుల్లో కుక్క కాట్లు 3 శాతం మేరకు పెరిగాయి. అలాగే భారీ వర్షాలు కురిసే సమయంలోనూ ఈ ముప్పు ఒకశాతం మేరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. 

ఇది కూడా చదవండి: భారత్‌లో అధికంగా విక్రయమయ్యే కండోమ్‌ బ్రాండ్స్‌..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top