కరోనా కేసులు 10 కోట్లు దాటేశాయ్‌

Corona cases have crossed 10 crores world wide - Sakshi

కరోనాతో అమెరికా, యూరప్‌ అతలాకుతలం

ప్రపంచ దేశాల్లో ఉధృతంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా యూరప్‌లో నిరసన ప్రదర్శనలు 

వాషింగ్టన్‌– లండన్‌: కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లో బట్టబయలై ఏడాది దాటినప్పటికీ ఇంకా ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తూనే ఉంది. ముఖ్యంగా అమె రికా, యూరప్‌ దేశాలు కరోనాతో అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోతే మృతుల సంఖ్య 22 లక్షలకి చేరువలో ఉంది. కేసుల సం ఖ్యాపరంగా చూస్తే రెండున్నర కోట్ల కేసులతో అమెరికా అగ్రభాగంలో ఉంది. ఇక మృతుల సంఖ్య 4 లక్షల దాటేయడం ఆందోళన పుట్టిస్తోంది. రెండో ప్రపంచ యుధ్ధం కంటే ఈ సంఖ్య ఎక్కువ.

అమెరికా తర్వాత స్థానాల్లో భారత్, బ్రెజిల్, రష్యా, యూకే ఉన్నాయి. అయితే ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య పరంగా చూస్తే అమెరికా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానాల్లో ఫ్రాన్స్, యూకే, బ్రెజిల్, బెల్జియంలు ఉన్నాయి. ప్రధానంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో ప్ర స్తుతం కరోనా విలయ తాండవం చేస్తోంది. పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ జోరందుకుంది. కరోనా కట్టడికి కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రత్యేక దృష్టి సారించారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికాలో కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రోజుకి 15 లక్షల మంది వ్యాక్సిన్‌ ఇవ్వడమే లక్ష్యంగా నిర్ణయించారు. 

నిరసనల మధ్య..
బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్‌తో యూరప్‌లో థర్డ్‌ వేవ్‌ కరోనా విజృంభిస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి వివిధ దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నెదర్లాండ్స్‌లో ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 9 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తూ ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉరక్‌ పట్టణంలో కోవిడ్‌ సెంటర్‌ని దగ్ధం చేశారు. ప్రభుత్వ ఆంక్షల్ని తట్టుకోలేని మరికొందరు సూపర్‌ మార్కెట్లను లూటీ చేస్తున్నారు.

కరోనా ఆంక్షల్ని రోజుల తరబడి భరించలేని స్థితిలోకి వెళ్లిపోయిన డెన్మార్క్‌ వాసులు హింసకు తెర తీశారు. స్పెయిన్‌లో మాస్కులు ధరించడానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి.  కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడమే కాదు ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల్ని కుంగదీసింది. 2009 నాటి ఆర్థిక మాంద్యం కంటే కరోనా ప్రభావంతో 2020 ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ  అధ్యయనంలో వెల్లడైంది. 2019తో పోల్చి చూస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా పని గంటల్లో 8.8శాతం తగ్గిపోయాయి.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top