
అత్యాధునిక ఆయుధ తయారీలో నిమగ్నమైన చైనా
శక్తివంతమైన క్రిస్టల్‌ను తయారుచేసిన డ్రాగన్ దేశం
పరారుణ కాంతి పుంజాన్ని వెలువర్చనున్న అసాధారణ కృత్రిమ స్ఫటికం
ప్రపంచంలోనే అతిపెద్ద బీజీసీఈ స్ఫటికమిది
ఎల్రక్టానిక్స్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్‌సహా ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న చైనా ఇప్పుడు మరో అసాధారణ, శక్తివంతమైన ఆయుధ తయారీలో తలమునకలైంది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఎన్నెన్నో ఆవిష్కరణలు చేసిన చైనా ఇప్పుడు దేశ భద్రత, రక్షణే పరమావధిగా కీలక ఆయుధాన్ని సృష్టిస్తోంది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మకప్రాంతాల గుట్టుమట్టు చెప్పే విదేశీ, శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే లేజర్ కాంతి ఆయుధాన్ని అభివృద్ధిచేస్తోంది.
కాంతి సాధారణ స్థాయిలోకాకుండా ప్రత్యేకమైన స్ఫటికాల గుండా ప్రసరించినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. అత్యంత తీక్షణతో ప్రసరిస్తూ ఆ లేజర్ కాంతి ఎంతటి కఠినమైన పదార్థాౖన్నైనా సునాయాసంగా కోసేస్తుంది. భవిష్యత్తులో పనికిరాకుండా సర్వనాశనంచేసేస్తుంది. లేజర్ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లేజర్ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల ఉపగ్రహాలపైకి చైనా ప్రయోగించనుంది.
భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలను నేలమీద నుంచే గురిచేసి కొట్టడం అంత తేలికైనపని కాదు. అందుకే బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఎంత పెద్ద ఇనుపగుండుతో దెబ్బ కొడితే అంతగా బీభత్సం స్థాయికి పెరుగుతుంది. అలాగే బీజీసీఈ క్రిస్టల్ నుంచి వెలువడే లేజర్ కాంతి సృష్టించే వినాశనం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది.
సూక్ష్మం నుంచే సర్వనాశనం..
బీజీఈసీతో తయారైన లేజర్ కాంతి పుంజం వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. కత్తి అంచును ఎంత సానబడితే అంత పదునెక్కుతుంది. అలాగే ఈ స్ఫటికం ఎంత పారదర్శకంగా ఉంటే అందులోంచి వెలువడే లేజర్ కాంతి అంత ప్రాణాంతకంగా మారుతుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. అలా అది ఏకంగా ఉపగ్రహాలను సైతం ముక్కలుగా కోసేస్తుంది.
స్వల్పశ్రేణి పరారుణకాంతి పుంజాలను అత్యంత సుదూరమైన లేజర్ కాంతి పుంజాలుగా, మారణాయుధాలుగా మార్చేందుకు బీజీఈసీ స్ఫటికం అక్కరకొస్తుంది. ‘‘చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 550 మెగావాట్ల లేజర్ కాంతిని ఈ స్ఫటికం ప్రసరింపజేస్తుంది. ఇంతటి తీక్షణత ధాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహ ఉపరితల పొరనైనా ముక్కలవడం ఖాయం. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రు ఉపగ్రహాలను ఉన్నచోటులోనే ఉన్నపళంగా నిరీ్వర్యంచేసే శక్తి ఈ క్రిస్టల్ పరారుణ కాంతి ఆయుధానికి ఉంది’’అని ప్రొఫెసర్ వూ హైక్సిన్ అన్నారు. ఈయన సింథటిక్ క్రిస్టల్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనాపత్రానికి ముఖ్యరచయితగా వ్యవహరించారు.
అత్యంత సురక్షితం, అతి సామర్థ్యం..
ఇంతటి తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధవ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులురాకుండా దీనిని తయారుచేస్తున్నారు. గతంలో అమెరికా అచ్చం ఇలాంటి ప్రయోగమే చేసి చేతులుకాల్చుకుంది. 1997లో అమెరికా నావికాదళం మిడ్ ఇన్‌ఫ్రారెడ్ అడ్వాన్స్‌డ్ కెమికల్ లేజర్(మిరాకిల్) పేరిట ఒక ప్రయోగంచేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. కానీ ఆ లేజర్‌బీమ్‌ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా చైనా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా శాస్త్రవేత్తలే తొలిసారిగా 2010లో అభివృద్ధిచేశారు. వెంటనే దీనిని తమ ఆయుధవ్యవస్థల్లో అమర్చుకునేందుకు పలు దేశాల రక్షణశాఖలు ప్రయత్నించినా అది ఎందుకో సఫలంకాలేదు.
– సాక్షి, నేషనల్ డెస్క్