హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్‌షిప్‌లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్‌వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం


