బంగ్లాదేశ్‌లో సైనిక పాలన.. దేశం విడిచిన షేక్‌ హసీనా | Bangladesh Protests: PM Sheikh Hasina Resign Live Updates | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో సైనిక పాలన.. దేశం విడిచిన షేక్‌ హసీనా

Aug 5 2024 2:44 PM | Updated on Aug 5 2024 5:26 PM

Bangladesh Protests: PM Sheikh Hasina Resign Live Updates

ఢాకా: అవామీ లీగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ హసీనా(76) బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజర్వేషన్ల ఆందోళనలు తీవ్ర స్థాయిలో చేరడం.. సైన‍్యం హెచ్చరికల నేపథ్యంలో ఆమె దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ వెంటనే పాలనను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. అన్ని పార్టీలతో చర్చించాకే సైనిక పాలన ప్రకటన చేస్తున్నామని, దేశంలో శాంతి భద్రతలను ఇక ఆర్మీ పర్యవేక్షిస్తుందని, ప్రజలు సంయమనం పాటించాలని, త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటునకు సహకరిస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌ ప్రకటించారు. 

‘‘మేం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.  నిరసనల వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ హింసను ఆపాల్సిన సమయం ఇది. నా ప్రసంగం తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. పరిస్థితుల్లో మార్పు వస్తే.. ఎమర్జెన్సీ అవసరం ఉండదు’’ 
::: ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌

రిజర్వేషన్ల వ్యవహారంలో బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. హింసాత్మక ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఇప్పటిదాకా వందల మంది మరణించారు. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆదివారం ఒక్కరోజే వంద మంది దాకా మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఆందోళనలు తీవ్ర ఉధృతం కావడంతో రాజీనామా ప్రకటనను జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ద్వారా చేయాలని హసీనా భావించారు. అయితే.. 

సైన్యం ఆమెకు అంత సమయం ఇవ్వలేదు. ఈ ఉదయం ఢాకాలోని ప్రధాని భవనం ‘గణభబన్’కు చేరుకున్న ఆర్మీ చీఫ్‌ వాకర్‌ ఉజ్‌ జమాన్‌.. రాజీనామా విషయంలో హసీనాకు 45 నిమిషాల డెడ్‌లైన్‌ విధించారని, సైన్యం సూచనల మేరకే ఆమె హెలికాఫ్టర్‌లో సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారని తెలుస్తోంది. మరోవైపు.. హసీనా ఢాకా విడిచిపెట్టారనే సమాచారం అందిన వెంటనే వేల మంది నిరసనకారులు ప్రధాని నివాసాన్ని చుట్టుముట్టి విధ్వంసకాండకు దిగారు. ఆ దేశ మాజీ ప్రధాని, హసీనా తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ విగ్రహాన్ని సైన్యం ధ్వంసం చేశారు. అయితే కాసేపటికే సైన్యం రంగప్రవేశం చేయడంతో వాళ్లంతా వెనక్కి తగ్గారు. ఆ తర్వాత  సైన్యం పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించింది. 

బంగ్లావ్యాప్తంగా సంబురాలు
మరోవైపు.. హసీనా దేశం విడిచి వెళ్లిపోయారని సైన్యం ప్రకటించగానే.. రోడ్ల మీదకు చేరిన లక్షల మంది నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపుల్లోకి వచ్చే దాకా కర్ఫ్యూ కొనసాగుతుందని ఆర్మీ ప్రకటించింది. 

 

 ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా నిరసనల్లో వందల మంది(300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించినట్లు తెలుస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా, ఆమె సోదరితో కలిసి హెలికాఫ్టర్‌లో వెళ్లినట్లు సమాచారం. అయితే ఆమె అగర్తలకు చేరుకుని.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడి నుంచి ఆమె విదేశాలకు వెళ్లొచ్చని తెలుస్తోంది.

 మరోవైపు.. తాజా పరిణామాలపై హసీనా తనయుడు స్పందించారు. బలవంతంగా అధికారాన్ని లాక్కోవడం మంచిది కాదంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ చేశారాయన. 

భారత్‌ సరిహద్దులో అప్రమత్తం
బంగ్లాదేశ్‌ పరిస్థితులపై భారత్‌ అలర్ట్‌ అయ్యింది. చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నందునా.. సరిహద్దులో నిఘా పెంచాలని సైన్యం నిర్ణయించింది. అంతకు ముందు.. భారత విదేశాంగశాఖ బంగ్లాలో ఉన్న భారతీయులను అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ జారీ చేసింది. అయితే.. ఇప్పటికే చాలామంది భారతీయులు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.  

ప్రపంచంలోనే మహిళా నేతగా..  
గత పదిహేనేళ్లుగా బంగ్లా ప్రధాని పదవిలో షేక్‌ హసీనా కొనసాగుతున్నారు. 1996 జూన్‌లో తొలిసారి ఆమె ప్రధాని పదవి చేపట్టారు. ఆ తర్వాత 2009 నుంచి రాజీనామా దాకా ఆమె ప్రధానిగా కొనసాగారు. మొత్తంగా 20 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆమె.. సుదీర్ఘకాలంగా ప్రధాని పదవిలో కొనసాగిన బంగ్లాదేశ్‌ నేతగానే కాకుండా ప్రపంచంలోనూ తొలి మహిళా నేతగా ఘనత సాధించారు.

ఎందుకీ ఆందోళనలు?  
1971లో జరిగిన బంగ్లాదేశ్‌ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే.. 

2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచ్చింది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్‌ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. 

ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  అయితే.. సుప్రీం తీర్పు తర్వాత పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్లే కనిపించినప్పటికీ.. గత రెండ్రోజులుగా కొనసాగిన అల్లర్లు.. హింసాత్మక ధోరణిలో కొనసాగాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement