Rishi Sunak: రిషి ఓటమి వెనుక కారణాలివే..

Backstabbing, unfaithfulness behind Rishi Sunak defeat - Sakshi

రెడీ ఫర్‌ రిషి అంటూ బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి ఎన్నికలో మొదట్లో దూకుడు చూపించిన రిషి సునాక్‌ ఎందుకు ఓటమి పాలయ్యారు? ఎంపీల మద్దతు పుష్కలంగా ఉన్నా టోరీ సభ్యుల అండదండలు ఎందుకు లభించలేదు? భారత్‌ను వలసరాజ్యంగా మార్చిన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఒక భారతీయుడు పాలించే రోజు వస్తుందన్న ఆశలు ఎందుకు అడియాసలయ్యాయి? దీనిపై బ్రిటిష్‌ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి...

► కోవిడ్‌–19 పార్టీ గేట్‌ కుంభకోణంలో ఇరుక్కొన్న ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు రిషి వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం కన్జర్వేటివ్‌ పార్టీలో బలంగా ఏర్పడింది. రాజకీయ గురువని కూడా చూడకుండా జాన్సన్‌కు వ్యతిరేకంగా పని చేసి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి కల్పించారని టోరీ సభ్యులు విశ్వసించారు. ఆర్థిక మంత్రి పదవికి రిషి రాజీనామా చేయడంతో ఇతర మంత్రులూ అదే బాట పట్టారు. వారికి మద్దతుగా 50 మంది ఎంపీలు కూడా రాజీనామా చేయడంతో ఒత్తిడి పెరిగి జాన్సన్‌ గద్దె దిగాల్సి వచ్చింది. దీన్ని నమ్మకద్రోహంగానే టోరి సభ్యులు చూశారు. ఆ వెంటనే రెడీ ఫర్‌ రిషి అంటూ పోటీకి దిగి దూకుడుగా ప్రచారానికి తెర తీయడంతో ప్రధాని పదవి కోసమే అంతా చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. బోరిస్‌ కూడా రిషికి వ్యతిరేకంగా పని చేశారు.

► ప్రతి మగవాడి విజయం వెనకా ఒక మహిళ ఉంటుందంటారు. కానీ రిషి పరాజయం వెనుక దురదృష్టవశాత్తూ ఆయన భార్య, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షత ఉన్నారు. ఆమె ఎలిజెబెత్‌ రాణి కంటే సంపన్నురాలన్న ప్రచారముంది. అలాంటి వ్యక్తి పన్నులు ఎగ్గొట్టడానికి నాన్‌ డొమిసైల్‌ హోదాను అడ్డం పెట్టుకున్నారన్న ఆరోపణలు కూడా రిషికి ప్రతికూలంగా మారాయి.

► తన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ ప్రకటించిన పన్ను రాయితీలను వ్యతిరేకించడం కూడా రిషి కొంప ముంచింది. వాటివల్ల ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుందన్న రిషి వాదనకు కాకలు తీరిన ఆర్థికవేత్తలు మద్దతిచ్చినా టోరీ సభ్యులు మాత్రం ట్రస్‌ తక్షణం ఉపశమన చర్యలకే జై కొట్టారు.

► రిషీ అమెరికా గ్రీన్‌ కార్డు వివాదం కూడా ఆయనకు వ్యతిరేకంగా మారింది. బ్రిటన్‌కు మకాం మార్చాక కూడా గ్రీన్‌ కార్డును ఆయన అట్టిపెట్టుకున్నారని, ఎప్పటికైనా అమెరికాకు వెళ్లిపోవడానికే ఈ పని చేశారని సోషల్‌ మిడియాలో బాగా ప్రచారమైంది. ఆర్థిక మంత్రి కాగానే గ్రీన్‌కార్డును వదులుకున్నానని రిషి వివ రణ ఇచ్చినా అప్పటికే నష్టం జరిగిపోయింది.

► రిషి విలాసవంతమైన జీవితం కూడా ఆయనకు కాస్త చేటు చేసింది. ఆయన ఖరీదైన సూటు, బూటు, ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ ఫొటో సెషన్లో ఖరీదైన మగ్గుతో ఫోటోలు దిగడం వంటివి పత్రికల్లో పతాక శీర్షికలయ్యాయి. కరువు గుప్పిట్లో చిక్కిన బ్రిటన్‌లో గుక్కెడు నీళ్ల కోసం జనం విలవిల్లాడుతుంటే రిషీ యార్క్‌షైర్‌లోని తన కొత్తింట్లో 4 లక్షల పౌండ్లతో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించడం వివాదాస్పదమైంది. ‘నా ఫ్రెండ్స్‌ అంతా ధనవంతులే. నా స్నేహితుల్లో సామాన్యులెవరూ లేరు’ అంటూ ఎప్పుడో ఆయన మాట్లాడిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరలైంది. దీంతో రిషి అందరివాడు కాదన్న ప్రచారానికి బలం చేకూరింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top