Afghanistan Earthquake: తీరని విషాదాన్ని నింపిన అఫ్గనిస్తాన్‌ భూకంపం.. 1000 మంది మృతి

Afghanistan Earthquake: 1000 killed 1500 In Eastern Region - Sakshi

కాబూల్‌: అప్గనిస్తాన్‌లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్గనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 1,000 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ  దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది.  

వందలాది ఇళ్లు నేలమట్టం
రిక్టర్‌ స్కేల్‌పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్‌ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన ప్రాతం మారుమూల పర్వత ప్రదేశం కావడంతో సమాచార లోపం నెలకొంది. దీంతో సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. భూకంపం ధాటికి వందలాది ఇళ్లు, ఇతర భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది. భూకంపం కారణంగా తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఖోస్ట్ ప్రావిన్స్‌లో కూడా అనేక భవనాలు దెబ్బతిన్నాయి. భారీ తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు పాక్‌లోని లాహోర్‌, ముల్తాన్‌, క్వెట్టా వరకు విస్తరించాయి. పాక్టికా ప్రావిన్స్‌ పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో ఉంది. దీంతో పొరుగుదేశం పాకిస్థాన్‌లోనూ భూకంపం సంభవించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు

సాయం చేయండి
తమకు అంతర్జాతీయ సాయం కావాలని తాలిబన్లు ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తున్నాయి. ‘తీవ్రమైన భూకంపం పాక్టికా ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాలను కదిలించింది. వందలాది మంది మరణించారు. గాయపడ్డారు. చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి’ అని  తాలిబాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి బిలాల్ కరీమి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సహాయక చర్యల కోసం ఆ ప్రాంతానికి బృందాలను పంపామని తెలిపారు. కాగా తాలిబన్ల ఆక్రమణతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతున్న అఫ్గన్‌ ప్రజలను ఈ భూకంపం మరింత దీనస్థితిలోకి నెట్టివేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top