
నగరంలోని అల్కాపురి కాలనీ, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు సూడో పోలీసుల అవతారం ఎత్తారు.
హైదరాబాద్: నగరంలోని అల్కాపురి కాలనీ, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలకు చెందిన ఆరుగురు యువకులు సూడో పోలీసుల అవతారం ఎత్తారు. బెట్టింగ్ యాప్స్‌నకు సంబంధించిన హెల్ప్ డెస్క్‌ల నుంచి సమాచారం తీసుకుని, హవాలా ఏజెంట్లనే టార్గెట్‌గా చేసుకుని, బెట్టింగ్ యాప్స్ హెల్ప్ డెస్క్‌ల నుంచి సమాచారం తీసుకుని పంజా విసురుతున్నారు. వివిధ నగరాల్లో ఇలాంటి నేరాలు చేసిన ఈ ఆరుగురు గత నెలలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో దారి దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి హబీబ్‌గంజ్ ఠాణా పరిధిలో ఇద్దరి నుంచి రూ.20 లక్షలు లూటీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఆ పోలీసులు ఇరువురిని అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం ప్రత్యేక బృందం ఆదివారం సిటీకి చేరుకుంది.
బెట్టింగ్ యాప్స్ పనితీరు అధ్యయనం చేసి..
అల్కాపురి కాలనీ, ఎన్టీఆర్ నగర్ వాసులు బత్తుల మహేష్, చిన్నం కృష్ణ, అనిల్, శేఖర్, సతీష్, ప్రదీప్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ రకాల బెట్టింగ్స్ యాప్స్‌లో పందేలు వేసే అలవాటు ఉన్న ఈ ఆరుగురూ వాటి పని తీరును సమగ్రంగా అధ్యయనం చేశారు. ఆయా బెట్టింగ్ యాప్స్‌లకు సంబంధించిన ఖాతాలను డౌన్‌లోడ్ చేసుకున్న వ్యక్తికి సంబంధించిన బ్యాంకు ఖాతాలతో అనుసంధానించి ఉంటాయి. ఈ యాప్స్ ద్వారా పందేలు కాసే ముందు కచ్చితంగా వాటిలో నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత మొత్తం వరకు బ్యాంకు ఖాతా నుంచి బదిలీ చేసే అవకాశం ఉన్నా.. భారీ మొత్తాలను మాత్రం బెట్టింగ్ యాప్స్ హవాలా మార్గంలో తీసుకుంటాయి. దీనికోసం ప్రతి యాప్‌నకు ఓ హెల్ప్ డెస్క్ పని చేస్తూ ఉంటుంది. దీన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన ఈ ముఠా దేశంలోని వివిధ నగరాల్లోని హవాలా ఏజెంట్లను టార్గెట్‌గా చేసుకుంది.
అద్దె వాహనంలో నగరం నుంచి వెళ్తూ...
సూడో పోలీసుల అవతారం ఎత్తిన ఈ గ్యాంగ్ కొన్నాళ్లుగా వివిధ నగరాల్లో పంజా విసురుతోంది. సిటీ నుంచి ఓ వాహనం అద్దెకు తీసుకువెళ్లి తమ ‘పని’ పూర్తి చేసుకుని వచ్చేస్తోంది. ఆయా నగరాలకు చేరుకున్న తర్వాత ఈ ఆరుగురూ లాడ్జిల్లో బస చేస్తారు. ఆ ప్రాంతానికి చెందిన వారుగా బెట్టింగ్ యాప్స్‌లో నమోదు చేసుకుంటారు. వీరి జీపీఎస్ లొకేషన్స్ కూడా సదరు యాప్స్‌లో అక్కడివే నమోదవుతాయి. ఒకటిరెండు రోజులు చిన్న మొత్తాలతో పందేలు కాసి, ఆపై భారీ మొత్తం వెచ్చిస్తామంటూ ఆయా యాప్స్‌నకు సంబంధించిన హెల్ప్ డెస్క్‌ల్ని సంప్రదిస్తారు. వీళ్లు తమతో ఒప్పందాలు కలిగి ఉన్న హవాలా ఏజెంట్ల ఫోన్ నంబర్లను వీరికి అందిస్తుంటారు. ఇలా నంబర్లు చేతికి చిక్కిన తర్వాత ఈ ఆరుగురూ అసలు కథ ప్రారంభిస్తారు.
వాట్సాప్ ద్వారా ఫోన్లు చేసి..
తాము బస చేసిన ప్రాంతానికి చుట్టుపక్కల రెక్కీ చేసే ఆ ముఠా సభ్యులు దోపిడీకి అనువైన ప్రాంతాన్ని తొలుత గుర్తిస్తారు. ఆపై ఆయా హవాలా ఏజెంట్లను వాట్సాప్ ద్వారా కాల్స్ చేసే ఈ గ్యాంగ్ తాము ఫలానా యాప్‌నకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వాల్సి ఉందని చెబుతుంది. నగదు తీసుకోవడానికి నిర్ణీత సమయానికి రావాలంటూ రెక్కీ చేసిన ప్రాంతం లొకేషన్‌ను వాట్సాప్‌లో షేర్ చేస్తారు. అలా వచ్చిన ఏజెంట్లతో తాము పోలీసులమని చెబుతూ తమ వాహనంలో ఎక్కించుకుంటారు. అప్పటికే వారి వద్ద ఉన్న డబ్బు దోచుకోవడంతో పాటు వాళ్ల ఫోన్లలోని సిమ్‌కార్డుల్నీ లాక్కుంటారు. వీటిని తమ ఫోన్లలో వేసుకునే ముఠా సభ్యులు ఫలానా వ్యక్తి నుంచి నగదు అందినట్లు హెల్ప్ డెస్క్‌లకు ఏజెంట్ల మాదిరిగా మెసేజ్ పంపిస్తారు. దీంతో ఆయా డెస్క్‌లు నిర్ణీత మొత్తాన్ని వీరి బెట్టింగ్ యాప్స్‌లోకి బదిలీ చేస్తాయి. కొద్దిసేపటి తర్వాత ఆ నగదును తమ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకునే ఈ గ్యాంగ్ స్వాహా చేస్తుంది.
భోపాల్ పోలీసుల చొరవతో ఆటకట్టు...
ఈ ముఠా టార్గెట్ చేసేది హవాలా ఏజెంట్లను కావడంతో ఇన్నాళ్లూ పోలీసుల వరకు విషయం వెళ్లలేదు. దీంతో యథేచ్ఛగా రెచ్చిపోయిన ఈ ముఠా గత నెల 17న భోపాల్‌లో పంజా విసిరింది. అక్కడి హబీబ్‌గంజ్ ఠాణా పరిధిలో ఉన్న 1100 క్వార్టర్స్ ప్రాంతంలో కిషన్ పటేల్, మీట్ సింగ్ రాజ్‌పుత్‌ల నుంచి రూ.20 లక్షలు దోచుకుపోయారు. తొలుత భయపడిన ఈ ద్వయం ఆపై గుజరాత్‌లోని తమ యజమానికి విషయం చెప్పింది. ఆయన ఆదేశాల మేరకు హబీబ్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఎస్సై మనోజ్ యాదవ్ నేతృత్వంలోని బృందం సాంకేతిక ఆధారాలను బట్టి మహేష్, కృష్ణలను వాహనంతో సహా అక్కడి సోంకట్ టోల్‌ప్లాజా వద్ద పట్టుకుంది. మిగిలిన నలుగురూ అప్పటికే నగరానికి వెళ్లిపోయారని వీళ్లు చెప్పడంతో వారి కోసం ప్రత్యేక బృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడి పోలీసుల సహకారంతో ముమ్మరంగా గాలిస్తోంది.
చీకటి కోణం బయటపడింది..
హబీబ్‌గంజ్ ఠాణా పరిధిలో చోటు చేసుకున్న ఈ నేరంతో బెట్టింగ్ యాప్స్–హవాలా నెట్‌వర్క్ మధ్య ఉండే సంబంధాల చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై సంబంధిత శాఖలకు సమాచారం ఇస్తాం. ఈ దారి దోపిడీలో ఆరుగురు పాల్గొన్నట్లు వెలుగులోకి రావడంతో బందిపోటు దొంగతనంగా మారుస్తున్నాం. ఈ సొమ్ములో రూ.10 లక్షలను కృష్ణ వ్యవసాయ భూమి ఖరీదు చేయడానికి మరో వ్యక్తికి బదిలీ చేశాడు. రూ.2 లక్షలు మరో బ్యాంకు ఖాతాలోకి మళ్లించాడు. దీన్ని బట్టి చూస్తే ఇతడే గ్యాంగ్ లీడర్ అని భావిస్తున్నాం.
– ‘సాక్షి’తో భోపాల్ పోలీసు ఉన్నతాధికారి