GO 111: మాస్టర్‌ప్లాన్‌ ఇప్పట్లో లేనట్టే!

- - Sakshi

హైదరాబాద్: జీఓ 111 పరిధిలో ఎలాంటి మాస్టర్‌ప్లాన్‌ లేకుండానే భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ నిబంధనలకు అనుగుణంగానే అనుమతులను ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 111 జీఓ పరిధిలోని 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే అవకాశం లేదు.

ప్రస్తుతం బయో కన్జర్వేషన్‌ జోన్‌లోని భూములను చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ (సీఎల్‌యూ) కింద వివిధ రకాలుగా వినియోగంలోకి అనుమతులను ఇస్తారు. ప్రభుత్వ అనుమతితో భూ యజమానులు తమ భూమిని పారిశ్రామిక, నివాస, వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం మార్చుకోవచ్చు.

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూములను, నాలా భూములను ప్రత్యేక కమిటీ ద్వారా చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ ద్వారా నివాసయోగ్యమైన స్థలాలుగా మార్పు చేస్తున్నట్లుగానే జీఓ 111 పరిధిలోని బయో కన్జర్వేషన్‌ భూములను కూడా మార్చుకొనేందుకు సదుపాయం ఉంటుందని ఒక అధికారి వివరించారు. ప్రస్తుతం జంట జలాశయాలకు 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలను అనుమతించడం లేదు. బఫర్‌ జోన్‌ పరిధిని ఎంత వరకు అనుమతించాలనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ముంచుకొస్తున్న ఎన్నికలు..
మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానించడం మొదలుకొని మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసేవరకు కనీసం18 నెలల సమ యం పడుతుంది. ఈ ప్రక్రియలో ఏ మాత్రం జాప్యం జరిగినా 2 సంవత్సరాలు కూడా దాటవచ్చు. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు తరుముకొస్తున్న దృష్ట్యా ఎలాంటి మాస్టర్‌ ప్లాన్‌ లేకుండానే భూముల బదలాయింపునకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన జీఓ 168 ప్రకారం సీఎల్‌యూ అందజేయనున్నారు. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఆమోదంతో భూమిని మార్పు చేస్తారు.

మరోవైపు జీఓ 111 పరిధిలోని శంషాబాద్‌, మెయినాబాద్‌, గండిపేట, చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌, కొత్తూరు మండలాల పరిధిలోని 84 గ్రామాల్లో ఉన్న 1.32 లక్షల ఎకరాల భూములలో ఇప్పటికే సుమారు 70 శాతం భూములు సినీ, రాజకీయ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆయా వర్గా లకు చెందిన భూయజమానులు తమ అవసరాలకు అనుగుణంగా సీఎల్‌యూ తీసుకొనే అవ కాశం ఉంది. భూ వినియోగ మార్పిడికి అనుమ తిచ్చే క్రమంలో జల వనరులు, అడవులు, కొండలు, గుట్టలు, నాలాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని వెసులుబాటు కల్పించనున్నట్లు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఎన్నికల తర్వాతే ఒకే నగరం–ఒకే ప్రణాళిక..
● ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం మొత్తం 5 మాస్టర్‌ప్లాన్లతో కూడి ఉంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎంసీహెచ్‌), సైబరాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీడీఏ), హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఏడీఏ), ఓఆర్‌ఆర్‌ మాస్టర్‌ప్లాన్లతో పాటు 2013లో హెచ్‌ఎండీఏ రూపొందించిన 2030–31 మాస్టర్‌ ప్లాన్‌ కూడా అమల్లో ఉంది. ఈ అయిదు ప్రణాళికల మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక రకాలుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

● అన్నింటిని కలిసి ఒకే బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రభుత్వం గతంలోనే కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలోనే గతేడాది జీఓ 111 తొలగించనున్నట్లు ప్రకటించిన అనంతరం ‘ఒకే నగరం–ఒకే ప్రణాళిక’ లక్ష్యంతో బృహత్తర ప్రణాళిక కోసం చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీ ఒకసారి సమావేశమైంది. కానీ ముందుకు వెళ్లలేదు. ఒకే నగరం – ఒకే ప్రణాళిక లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన కోసం చర్యలు చేపట్టింది. ఎన్నికల తర్వాత ఈ ప్రతిపాదనను తిరిగి ముందుకు తెచ్చే అవకాశం ఉంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top