
బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట..
హైదరాబాద్: తెల్లవారగానే బాలిక మృతి వార్త నగర ప్రజల గుండెల్ని పిండివేసింది. వేసవిలోనే చోటు చేసుకున్న ఈ దుర్ఘటన రాబోయే రోజుల్లో ఎలా ఉండాలో తీవ్రంగా హెచ్చరించినట్లయింది. అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియదు. వర్షాకాలం వచ్చేంత వరకు పనులు చేస్తామంటే కుదిరేలా లేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కచ్చితమైన రక్షణ చర్యలు తీసుకోని పక్షంలో ఇంకెన్నో దారుణాలు జరగనున్నాయి. జీహెచ్‌ఎంసీ ఇకనైనా తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ఇంకెంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందోనని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దారుణాలు అడ్డుకట్ట పడదా?
ప్రతియేటా తగిన రక్షణ చర్యలు తీసుకున్నామంటున్నప్పటికీ, జరగాల్సిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ పనుల్లో నిబంధనల పాటింపు ప్రకటనల్లో తప్ప వాస్తవంగా అమలు కావడం లేదు. కాగితాల్లో తప్ప కార్యరూపం దాల్చడం లేదు. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు, దారి మళ్లింపు సైనేజీలు, రాత్రివేళ విద్యుత్ లైట్లు, పనులు చేస్తున్న ఏజెన్సీ, సంబంధిత అధికారి పేర్లు, ఫోన్ నంబర్లు వంటివి ఎక్కడా కనిపించవు. అది ఎస్సార్‌డీపీ పని అయినా, ఎస్‌ఎన్‌డీపీ పని అయినా, మరో పని అయినా అంతే.తాజా ఘటనలో బాలిక మరణానికి కారణం రోడ్డు పనులు. కొత్త రోడ్డు కోసం పాతరోడ్డును రెండు వారాల క్రితం తవ్వారు. రోడ్డుపై గుంత ఉన్నా దానికి అడ్డుగా ఏది పెట్టకపోవడం, బారికేడ్లు, సైనేజీల వంటివి లేకపోవడంతో అక్కడ గుంత ఉన్నట్లు తెలియకుండా పోయింది. నాలాల్లో ఎలాంటి ప్రాణాపాయం జరగరాదని మంత్రి కేటీఆర్ పలు పర్యాయాలు అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పసిప్రాణం పోయింది.
నిండా నిర్లక్ష్యం..
వర్షాకాలం కాకపోయినా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్షాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలున్నాయి. అయినా అధికారులు నిర్లక్ష్యం వీడలేదు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.
పట్టింపులేని తనం..
అధికారులకు ఎప్పటినుంచో చెబుతున్నాం అని పేర్కొన్న మేయర్ ఎంత కాలంగా చెబుతున్నారో.. అయినా శ్రద్ధ చూపనందుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆమెకే తెలియాలి. మేయర్, కమిషనర్, చీఫ్ ఇంజినీర్లు క్షేత్రస్థాయి తనిఖీలు చేసి.. లోపాలు దృష్టికి వచ్చినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావనే అభిప్రాయాలున్నాయి.
నిద్రమత్తు వీడరా..?
నాలా సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా ఎస్‌ఎన్‌డీపీ పనుల్లోనే కాదు నడిచే దారుల్లో, రోడ్లు, ఫుట్‌పాత్‌ల కింద, నాలాలు, మురుగునీటి లైన్లు ఉన్న ప్రాంతాల్లో గోతులు, గుంతలు లేకుండా చేయాలి. లేనిపక్షంలో వాన కురిసినప్పుడు అవి కనిపించక ప్రాణాపాయ పరిస్థితులుంటాయని గతంలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసినా నిద్రమత్తు వీడలేదు. నాలాల్లో పడి మరణాలు జరిగితే ఉన్నతాధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ హెచ్చరించినా, మేయర్ నగరవ్యాప్తంగా పర్యటించాలని ఆదేశించినా చలనమే లేకుండాపోతోంది.
ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే..
నాలాల్లో పడిపోకుండా అవసరమైన ప్రాంతా ల్లో బారికేడ్లు, సేఫ్టీ గ్రిల్స్ ఉండాలి.
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో లైట్లుండాలి.
నడిచే దారుల్లో, రోడ్లు, ఫుట్‌పాత్‌ల కింద నాలాలు, మురుగునీటి లైన్లు ఉన్న ప్రాంతాల్లో గోతులు లేకుండా చేయాలి. లేనిపక్షంలో వాన కురిసినప్పుడు అవి కనిపించక ప్రాణాపాయ పరిస్థితులుంటాయి.
పనులు పూర్తికాని ప్రాంతాల్లో అటువైపు వెళ్లకుండా బారికేడ్లు, తదితర రక్షణ ఏర్పాట్లు చేయాలి.
గుంతలు, రోడ్ కటింగ్‌లు ఉంటే సంబంధిత ఈఈ దష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి.
రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి.
అన్ని మ్యాన్‌హోళ్లు.. క్యాచ్‌పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు.
పనులు జరిగే అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి.