నిలిచిన వైద్యసేవలు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రోగుల వైద్యసేవలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున ఎంజీఎం పాతగేట్ సైకిల్ స్టాండ్ నుంచి క్యాజువాలిటీకి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం తీగల మీద పడి విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న ఎంజీఎం అధికారులు విద్యుత్ సిబ్బందితో మరమ్మతు పనులు ప్రారంభించారు. విద్యుత్ లేకపోవడంతో మాన్యువల్ పద్ధతిలో ఓపీ చిట్టీలు ఇచ్చారు. ఫిజియోథెరపీ విభాగంలో కూడా రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మధ్యాహ్నం వరకు ఎక్స్‌రేల కోసం పడిగాపులు కాసి ఇంటికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం వరకు విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో కొందరు కొందరు ఎక్స్‌రేలు తీయించుకున్నట్లు తెలుస్తోంది.
హన్మకొండ కల్చరల్: అధికార దుర్వినియోగం పరిపాలన నిర్లక్ష్యం, దేవాలయ భూముల ఆక్రమణలపై ఆర్‌హెచ్‌పీ, దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధుల ఆరోపణలు నిరాధారమైనవని, అవాస్తమైనవని దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్, భద్రకాళి దేవాలయం ఈఓ రామల సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రకాళి ఆలయంలో పూజ టికెట్లు, పులిహోర, ప్రసాద వితరణ కుంభకోణం, 13 తులాల బంగారు అభరణాల కాజేసే విషయాలపై పారదర్శకంగా విచారణ చేపట్టామని, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయి బాలబాలికలు, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రమేశ్‌కుమార్, డాక్టర్ రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హసన్‌పర్తి మండల పరిధి భీమారంలోని ఎర్రగట్టుగుట్ట సమీపంలోని కిట్స్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈటోర్నమెంట్‌లో పాల్గొనేందుకు (జనగామ, మహబూబాబాద్ మినహా) ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారులు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ, సాయంత్రం 5 గంటల్లోగా https: badminton telangana.com ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు డాక్టర్ పి.రమేశ్‌రెడ్డి 94405 99888, నాగకిషన్ 98480 27755 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల సెమిస్టర్ల పరీక్షలు, దూరవిద్య డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం హనుమకొండలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ సందర్శించారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు.
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులతో సమావేశమై, పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో అనుతీర్ణులైన విద్యార్థులకు వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులకు ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి గోపాల్, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, జీసీడీఓ సునీత తదితరులు పాల్గొన్నారు.


