ఆర్థిక సంక్షోభంలోనూ ఆగని పథకాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలోనూ ఆగని పథకాలు

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

ఆర్థిక సంక్షోభంలోనూ ఆగని పథకాలు ఆటిజం పిల్లలు ఉన్నత స్థాయికి.. ముగిసిన బార్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

రామన్నపేట: గత పాలకుల కారణంగా రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సమర్థంగా ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేస్తున్నట్లు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నగరంలోని 29వ డివిజన్‌లో నిర్వహించిన వార్డు సభలో మేయర్‌ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించి వార్డు పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ కాలం నుంచి నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం స్థానికంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ జగన్‌, డివిజన్‌ అధ్యక్షులు పూర్ణ, నాయకులు విజయ్‌, శ్వేత, రోషన్‌, అధికారులు పాల్గొన్నారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌

హన్మకొండ అర్బన్‌: ‘ఆటిజం ఉన్న పిల్లలు ప్రత్యేక ప్రతిభ కలిగిన వారు. సరైన మార్గదర్శకం, సహకారం అందిస్తే వారు ఉన్నత స్థాయికి ఎదగగలరు’ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని మల్లికాంబ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌, ప్రతిమ రిలీఫ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనన్‌స్టిట్యూషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రతిమ రిలీఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థుల అవగాహన ర్యాలీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రతిమ రిలీఫ్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి.రమేశ్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణలీల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (సైకియాట్రిస్ట్‌) డాక్టర్‌ రవిచంద్ర, డాక్టర్‌ సుదీప్‌ (అపర్ణ హాస్పిటల్‌), మల్లికాంబ సంస్థ నిర్వాహకులు బండ రామలీల, ప్రొఫెసర్‌ పద్మ, బి.సదానంద రావు, కోడం కళ్యాణ్‌, ఫాదర్‌ జెరోమ్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌ జిల్లా బార్‌ అసోసియేషన్‌ 2026–27 సంవత్సరానికి జరగనున్న ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గురువారం ముగిసింది. దీంతో 16 స్థానాలకు జరగనున్న ఎన్నికలల్లో ఐదు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 11 స్థానాలకు ఈనెల 10న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి వై.శ్రీరాఘవరావు తెలిపారు. ఏకగ్రీవమైన స్థానాలు మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.లలితకుమారి, గ్రంథాలయ కార్యదర్శిగా జంపాల శ్రీను, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా డి.రాజేశ్‌, 30 సంవత్సరాల సీనియర్‌ కార్యవర్గ సభ్యుడిగా కూరపాటి అశోక్‌, 20 సంవత్సరాల సీనియర్‌ కార్యవర్గ సభ్యుడిగా జీవీ.రమణమూర్తి గెలుపొందినట్లు పేర్కొన్నారు. ఉపసంహరణ అనంతరం అధ్యక్ష స్థానానికి ఈ.ఆనంద్‌మోహన్‌, వి.కోటేశ్వర్‌రావు, పి.రమేశ్‌, సీహెచ్‌.ఉపేందర్‌ బరిలో ఉండగా.. ప్రధాన కార్యదర్శి స్థానానికి అనిల్‌కుమార్‌, నాగేంద్రచారి, శివ, పి.శ్రీనివాస్‌, ఉపాధ్యక్ష స్థానానికి సీహెచ్‌.సాంబశివరాజు, షేక్‌ రఫీ, కోశాధికారి (మహిళా రిజర్వుడ్‌) స్థానానికి బి.ఉమామహేశ్వరి, యు.వీణ ముఖాముఖి పోటీలో ఉన్నారు. సహాయ కార్యదర్శి (పురుషులు) ముగ్గురు అభ్యర్థులు, సహాయ కార్యదర్శి (మహిళ)కు నలుగురు అభ్యర్థులు, సీనియర్‌ మహిళా కార్యవర్గ స్థానానికి ఇద్దరు, మూడు కార్యవర్గ స్థానాలకు తొమ్మిది మంది బరిలో నిలవగా, ఒక మహిళా కార్యవర్గ స్థానానికి ముగ్గురు పోటీలో ఉన్నట్లు శ్రీరాఘవరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement