మంత్రి కొండా సురేఖ
కాశిబుగ్గ: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా వరంగల్ దేశాయిపేటలో వార్డు సభ నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ కావటి కవిత రాజుయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరవేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు వారికి చేరవేయాలని పిలుపునిచ్చారు. కాగా, తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని, తమ తమ్ముడికి పింఛన్ రావట్లేదంటూ కొందరూ మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాశిబుగ్గలోని 19వ డివిజన్, 20వ డివిజన్, ఎల్‌బీ నగర్‌లోని 13వ డివిజన్, లేబర్‌కాలనీలోని 18వ డివిజన్లలో గ్రామ పాలన, ప్రగతి ప్రణళిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కార్పొరేటర్లు కావటి కవితా రాజు యాదవ్, బస్వరాజు కుమారస్వామి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత రెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, సమ్మయ్య, డాక్టర్ రాజేశ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


