బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు : సీపీ
వరంగల్ క్రైం: బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డన్ర్స్ షేర్ స్వచ్ఛంద సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వరంగల్ విభాగం రూపొందించిన ప్రచార రథాన్ని కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం సీపీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలు పిల్లల చదువు, ఆరోగ్యం, శారీరక, మానసిక అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని కోరారు. అదనపు డీసీపీ రవి, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శిరీష, జ్ఞానేశ్వరి, జమున, ప్రశాంతి, కల్పన, గాయత్రి, చామంతి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: మంగళూరు యూనివర్సిటీలో ఈనెల 27న నిర్వహించనున్న ఆల్‌ఇండియా ఇంటర్ యూనివర్సిటీ క్రాస్‌కంట్రీ టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ ఉమెన్ జట్టును ఎంపికచేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య బుధవారం తెలిపారు. పి.ఉషారాణి, ఎం.టాబు, పి.హర్షిత, ఎం.రోషిణి, ఎం.అరుణ, జె.భీంబాయి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సీహెచ్ బుచ్చయ్య జట్టుకు కోచ్‌కం మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులు, విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో బుధవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్.రవి మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో నిరంతర చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, మత్తుపదార్థాల విక్రయాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.శేషాద్రి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఫారిన్ డిప్యుటేషన్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన శేషాద్రి మాతృ సంస్థ పంచాయతీరాజ్ శాఖకు తిరిగి వెళ్లగా హనుమకొండ జిల్లా పరిషత్ సీఈఓగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
నయీంనగర్: భూసేకరణ కోసం కుడా డిప్యూటీ కలెక్టర్‌గా అడ్ల రవీందర్‌రెడ్డిని బుధవారం ప్రభుత్వం నియమించింది. ఆర్డీఓ నుంచి పదోన్నతి పొందిన ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా డిప్యుటేషన్‌పై కుడాకు వచ్చారు.
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు : సీపీ


