అంచనాలు సిద్ధం చేయండి
వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్‌లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్‌లో భాగంగా నగరంలో అదనపు పైప్‌లైన్‌లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్‌లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు జరుగుతుందని పేర్కొన్నారు. గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో బల్దియా ఎస్‌ఈ సత్యనారాయణ, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, పబ్లిక్ హెల్త్ డీఈ మొజామిల్, డీబీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్ : కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు – మీ హక్కు’ అనే అంశంపై ఈ నెల 24న శిబిరం నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక శాఖ పరిధి ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో అనుబంధంగా ఈ క్యాంపెయిన్ చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు ఖాతాదారులు, బీమా, డివిడెండ్, మ్యూచువల్ ఫండ్, పీఎఫ్ ఖాతా, బాండ్ ఖాతా తదితర వాటికి సంబంధించి ఏళ్లుగా అన్ క్లెయిమ్‌డ్ (దావా చేయని) మొత్తాలు ఉన్నవారు వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. క్లెయిమ్ చేయని ఆస్తుల వివరాలు ఉద్గమ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, బ్యాంకు శాఖ, బీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, స్టాక్ బ్రోకర్ లేదా ఆర్థిక సంస్థ ద్వారా స్టాక్ బ్రోకర్‌లో డివిడెండ్ పొందని వివరాలను కూడా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈఅవకాశాన్ని అందరూ సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ట్రాన్స్‌జెండర్స్‌కు 100%సబ్సిడీతో పునరావాస పథకం
కాజీపేట అర్బన్ : హనుమకొండ జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లకు వందశాతం సబ్సిడీతో ఆర్థిక పునరావాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఐదుగురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొకరికి రూ.75వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ట్రాన్స్‌జెండర్లు ఈనెల 31వ తేదీలోపు హనుమకొండ కలెక్టరేట్‌లోని సీ్త్ర,శిశు సంక్షేమాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
న్యూశాయంపేట : జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్దులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విదేశాల్లో పై చదువుల నిమిత్తం సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి గౌస్‌హైదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను వచ్చేనెల 19లోగా సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయ వేళలో సంప్రదించాలని సూచించారు.


