కంకవనాలు కనుమరుగు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మహాజాతర ఏర్పాట్ల పేరుతో మేడారం అటవీ ప్రాంతంలోని కంకవనాలు కనుమరుగువుతున్నాయి. భక్తుల సౌకర్యాల పేరుతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా విలువైన కంకవనాలను నరికివేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మేడారం ఆర్టీసీ బస్టాండ్‌లో తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తున్న గదులకు స్థానికంగా లభించే కంక బొంగులను వినియోగిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
అటవీ సంపదకు నష్టం..
జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా అటవీ సంపదను నాశనం చేయడం ఎంత వరకు సమంజసమనే పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు బయట ప్రాంతాల నుంచి కంక బొంగులను కొనుగోలు చేసి తీసుకొచ్చి గదుల ఏర్పాటుకు వినియోగించాల్సి ఉంది. కానీ, అక్రమంగా వెదురు బొంగులను గదులకు వినియోగిస్తున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోతే భవిష్యత్‌లో అడవుల పరిరక్షణ ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, కంక చెట్లు నరికి వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కంకవనాలకు ప్రాధాన్యం..
కంక చెట్లు మేడారం అటవీ ప్రాంతానికి జీవనాడీగా భావిస్తారు. కంక చెట్లు నేల తేమను నిలుపుకోవడంలో, వర్షపు నీటి నిల్వలో, వన్యప్రాణులకు ఆశ్రయంగా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల్లో కంక వనాలకు ప్రత్యేక ఉంది. అలాగే, సమ్మక్క– సారలమ్మ పూజా కార్యక్రమాల్లో వీటికి విశిష్టత ఉంది. సమ్మక్క–సారలమ్మను గద్దెలపై పూజారులు వెదురు బొంగులతో తయారు చేసిన బుట్టలో తీసుకురావడంతోపాటు తల్లుల గద్దెలపై కూడా కంకవనాలను పూజారులు ప్రతిష్ఠిస్తారు.
ప్రతీ జాతరకు ఇదే తంతు..
ప్రతీ ఏటా జాతర సమయంలో కంక వనాలను అక్రమంగా నరికివేస్తున్నారు. కాంట్రాక్టర్లు కొంత కొనుగోలు చేసిన వెదురు బొంగులను మేడారానికి తీసుకొచ్చి వినియోగించి, మిగిలింది మేడారం అటవీ ప్రాంతంలోని బొంగులను నరికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యథేచ్ఛగా అటవీ అనుమతి లేకుండా వినియోగిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఆర్టీసీ బస్టాండ్‌లోని తడకలు, వె దురు బొంగులతో ఏర్పాటు చేస్తు న్న గదులను పరిశీలిస్తున్నాం. కాంట్రాక్టర్లు తీసుకొచ్చిన వెదురు బొంగులకు సంబంధించిన అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నాం. మూడు రోజులు ఎన్నికల విధులకు వెళ్లాం. ఈ సమయంలో అటవీ నుంచి కంక బొంగులను తీసుకొచ్చి వినియోగించినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం.
– సాగర్‌రెడ్డి, సెక్షన్ ఆఫీసర్
మేడారంలో వెదురు చెట్ల నరికివేత
ఆర్టీసీ బస్టాండ్‌లో తడకల గదులకు వినియోగం
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
కంకవనాలు కనుమరుగు


