జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
రేగొండ: జంట హత్యల కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజుకు కొంతకాలంగా మానసిక స్థితి సరిగాలేదు. ఈక్రమంలో అతడు తరచుగా తల్లి హైమావతి, భార్యతో గొడవపడుతుండేవాడు. 2024 జనవరి 4వ తేదీన అర్ధరాత్రి తల్లితో గొడవపడి రోకలిబండతో దాడిచేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటిపక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డురాగా ఆమైపె కూడా దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. చికిత్స పొందుతూ జనవరి 14న మృతిచెందింది. ఈ ఘటనపై అప్పటి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కేసు నమోదు చేయగా అప్పటి చిట్యాల సీఐ వేణుచందర్.. నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అనంతరం సీఐ మల్లేశ్‌యాదవ్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గురువారం కోర్టులో విచారణ జరిగింది. నేరం రుజువు కావడంతో నిందితుడు రాజుకు పదేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రమేశ్‌బాబు తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన గణపురం సీఐ కరుణాకర్‌రావు, రేగొండ ఎస్సై రాజేశ్‌ను భూపాలపల్లి ఎస్పీ సంకీర్త్ అభినందించారు.
108 ప్రోగ్రాం మేనేజర్‌గా శివకుమార్
హన్మకొండ అర్బన్ : 108, 102 సర్వీస్‌ల ఉమ్మ డి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌గా పాటి శివకుమార్ బాధ్యతల స్వీకరించారు. ఇంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయనను రాష్ట్ర అధికారులు జిల్లాకు బదిలీ చేశారు. త్వరలో జరగనున్న మేడారం జాతర నేపథ్యంలో ప్రాధాన్యతను గుర్తించి ఆయనను ఇక్కడికి బదిలీ చేసినట్లు సమాచారం. వరంగల్‌లో పనిచేసిన సమయంలో మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. విధుల్లో చేరిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


