కదిలిన ధాన్యాగారం పునాదులు!
చింతల్, తూర్పుకోటకు వెళ్లే దారి, వాకింగ్ గ్రౌండ్ ఎదురుగా తూర్పు కోట క్రాస్ రోడ్డు వద్ద విలువైన కాకతీయుల కాలం నాటి ధాన్యాగారం పునాదులు కదిలిపోయాయి. రికార్డు ప్రకారం ఓ రైతు పట్టా భూమి అయినప్పటికీ, చారిత్రక నిర్మాణాల పక్కన రియల్టర్లు జేసీబీ యంత్రంతో చదును చేసే క్రమంలో ధాన్యాగారం పునాది రాళ్లు పూర్తిగా కదిలిపోయాయి. ఆనాడు కాకతీయులు విశాలమైన గదుల్లో ధాన్యాగారం నిల్వ చేసేవారు. దీని నిర్మాణం అండర్ గ్రౌండ్‌లో విశాలమైన గదులతో సుమారు 20 గుంటల విస్తీర్ణంలో ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దీనిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడడంతో ఎంతో విలువైన కళా సంపద కదిలిపోతోంది. కొద్ది రోజుల క్రితం ఉదయాన్నే పునాది రాళ్లను జేసీబీతో నెట్టేశారన్న ప్రచారం జరగడంతో ధాన్యాగారాన్ని చరిత్రకారులు పరిశీలించారు. ఈవిషయాన్ని కేంద్ర పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖిలా వరంగల్ కోటలో చారిత్రాత్మక ఆధారాలన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. నేటికీ మిగిలి ఉన్న కొన్ని కట్టడాలు, నిర్మాణాలను పరిరక్షించేందుకు కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా చారిత్రక నిర్మాణాలు ధ్వంసమవుతున్నాయి. పురాతన నిర్మాణాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధిత ప్రాంతం కాగా.. వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ తమకు తెలియదన్నట్లుగా రాత్రికి రాత్రే వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి నిర్మాణాలు చేపడుతున్నారు. కొద్ది నెలల వ్యవధిలో చింతల్‌బ్రిడ్జి నుంచి మధ్య కోట శిల్పాల ప్రాంగణం వరకు ఇరువైపులా తాత్కాలిక నిర్మాణాలు కొన్ని అయితే, మరికొన్ని పక్కా నిర్మాణాల్లో వ్యాపార సముదాయాలు ఏర్పడ్డాయి. నగర నడిబొడ్డున విశాలమైన ప్రదేశంలో కాకతీయుల అద్భుతమైన నిర్మాణాల్ని పర్యాటకులు, నగర ప్రజలు వీక్షిస్తారు. సాయంత్రం వేళ, ఆదివారం వచ్చిందంటే పల్లె వాతావరణం, పచ్చని పొలాల్లో ప్రజలు సేదదీరుతారు. కార్తీక మాసం వస్తే వనభోజనాలతో సందడిగా ఉండే ప్రదేశంలో నేడు ఎటూ చూసిన మధ్యకోట దారికి ఇరువైపులా నిర్మాణాలు వెలిశాయి. దీంతో పాలకూర తోటలు, వ్యవసాయ పంట పొలాలు ప్లాట్లుగా మారిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. ఉదయం లేవగానే రియల్టర్లు అక్కడే పాగా వేస్తున్నారు. చరిత్ర పరిరక్షణ కమిటీలు కదిలితే తప్ప కోటను కాపాడుకునే పరిస్థితిలేదని, రానున్న రోజుల్లో చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కొక్కటిగా కనుమరుగు..
కాకతీయుల విలువైన కళా సంపద, చారిత్రాత్మక ఆధారాలు ఒక్కొక్కటిగా కనుమరుగువుతున్నాయి. చారిత్రక బావులు చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. రాతి కోటపై ముళ్లపొదలు, భారీ వృక్షాలు పెరగడంతో రాళ్లను పెకిలించి వేస్తున్నాయి. ఇటీవల పడమరకోట ముఖద్వారం వద్ద పెద్ద రాళ్లు కూలిపోయాయి. పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది శిల్పాల ప్రాంగణంలో రోజంతా పనులు చేస్తూ సేదదీరుతున్నట్లు చరిత్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. చారిత్రక ఆధారాలు కనుమరుగవుతున్నా పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కోట కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. మట్టి కోట చుట్టూ ఉండాల్సిన అగర్తలు ఇప్పటికే 80 శాతం పూడ్చివేతకు గురై రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలోకి వెళ్లాయి. మరికొంత స్థలంలో శ్మశాన వాటికలు, పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రాతి, మట్టికోటలు కరిగిపోగా.. శిథిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, పురావస్తుశాఖ అఽధికారులు స్పందించి చారిత్రక ఆధారాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు కోరుతున్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
