 
															12 కేంద్రాల్లో పునరావాసం
వరంగల్ అర్బన్: ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షంతో బుధవారం గ్రేటర్ వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ముంపు బాధితుల కోసం నగరంలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. బుధవారం సాయంత్రం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని బీరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని సందర్శించి వరద బాధితులను ఓదార్చారు. కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ వేర్వేరుగా బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నగరంలోని వరద ప్రాంతాల్లో ఉధృతిని పరిశీలించారు. వరంగల్ నగరంలో 30, హనుమకొండలో 15 ప్రాంతాలు జలమయమయ్యాయని, బల్దియా ఆధ్వర్యంలో డీఆర్‌ఎఫ్, ఇంజనీరింగ్, శానిటరీ అధికారులతో 7 ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి వరదల్లో చిక్కుకున్న 1,200 మంది బాధితులకు 12 కేంద్రాల్లో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో టోల్‌ఫ్రీ నంబర్ 1800 425 1980 ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించి సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి..
భారీ వర్షాల దృష్ట్యా 24/4 రౌండ్ ది క్లాక్‌గా బల్దియా సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఉన్న ముంపు ప్రాంతాల వరదను ఐసీసీసీ ద్వారా తిలకించి, అధికారులు, సిబ్బందితో చర్చించి సహాయక చర్యలకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ఎక్కడైనా నీటమునిగిన ప్రాంతాలు, మ్యాన్ హోల్స్ తెరుచుకున్న ప్రాంతాలు, డ్రెయినేజీ అవరోధాలు వంటి వాటిని తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ ఎంహెచ్‌ఓ రాజేశ్, ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
7 ప్రత్యేక బృందాలతో 1,200 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
45 కాలనీలు జలమయం
ఐసీసీసీ నుంచి వరద ప్రాంతాలను పరిశీలించిన మేయర్, కమిషనర్
బల్దియాలో ప్రత్యేక
హెల్ప్‌లైన్ 1800 425 1980 ఏర్పాటు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
