
పశు సంపదను కాపాడుకోవాలి
ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హన్మకొండ: పశు సంపదను కాపాడుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్యశాలలో జాతీయ పశువ్యాధుల నివారణ కార్యకమాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. పాడి రైతులు పశు సంపదపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో పశుసంవర్థక శాఖ సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పశుసంపద మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకవంటిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత టీకా కార్యక్రమాన్ని రైతులంతా వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జంతు వ్యాధుల నిర్ధారణ ల్యాబ్ సహాయ సంచాకులు డాక్టర్ నాగమణి పశువ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పశు వైద్యాధికారి రాధాకిషన్, సహాయ సచాలకుడు శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, వినయ్, కరుణాకర్‌రెడ్డి, సిబ్బంది యాదలక్ష్మి, ఆకాశ్, వంశీ పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా (వరంగల్ అర్బన్)లోని 67 వైన్‌షాపులకు బుధవారం 48 దరఖాస్తులను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్వీకరించారు. కాగా, టెండర్ ప్రక్రియ ప్రారంభించన నాటి నుంచి మంగళవారం వరకు 219 దరఖాస్తులు ఎకై ్సజ్ శాఖకు మద్యం వ్యాపారులు అందించారు.
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ బీఎస్‌ఎల్ సౌజన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలలో హాజరు కావాలని కోరారు. సీట్ల వేకెన్సీల వివరాలు కళాశాల నోటీస్ బోర్డులో, టీజీఐసెట్.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.
కాజీపేట: ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఆల్ ఇండియా డ్యాన్సర్స్ అసోసియేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఇండియా సంస్థలు సంయుక్తంగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో ది టెంపుల్ డ్యాన్స్ విద్యార్థులు నట్వర్ గోపీకృష్ణ జాతీయ అవార్డులు దక్కించుకున్నారు. నృత్యం, అభినయం, క్రియేటివిటీ, ఓన్ కొరియోగ్రాఫిక్ స్కిల్స్, డాన్స్ సిలబస్‌పై పట్టును పరిశీలించి కళాకారులను విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. డ్యాన్స్ సీనియర్ విద్యార్థిని అనిశ్రితరెడ్డి కుందూరు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి నేషనల్ అవార్డును అందుకున్నారు. యూత్ కేటగిరీలో రావుల సాయి సంజనరెడ్డి నవోదిత కళాకార్ అవార్డు అందుకున్నారు. సీనియర్ విభాగంలో సంజనరెడ్డి సోమిరెడ్డి ద్వితీయ బహుమతి సాధించారు. డి.హన్విక, లక్ష్మి ప్రహర్షిత సీనియర్ గ్రూప్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. సబ్ జూనియర్ కేటగిరీలో జె.ఆరాధ్య ఉత్తమ ప్రతిభ కనబర్చింది. వరుణిక ప్రథమ బహుమతితో పాటు నృత్య కళా శ్రేష్ఠ అవార్డు అందుకున్నట్లు సీఈఓ ఆఫ్ ది టెంపుల్ డ్యాన్స్ హిమాన్సీ కాట్రగడ్డ తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి నుంచి 9వతరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ ఉమామహేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. హనుమకొండలోని వరంగల్ వెస్ట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో (పలివేల్పులవద్ద ఉన్న) దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను హనుమకొండ కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా సీటు కేటాయిస్తామని తెలిపారు.

పశు సంపదను కాపాడుకోవాలి