
భూసేకరణపై ప్రత్యేక దృష్టి
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ భూసేకరణ దిశగా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887గా డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ నిర్ణయించడంతో దాదాపు సగానికిపైగా మంది రైతులు తమ భూమి ఇచ్చేందుకు సుముఖమంటూ కన్సెంట్ లెటర్లు రెవెన్యూ అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో గాడిపల్లి గ్రామానికి చెందిన ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న యజమానులతో ఈనెల 25న అదే గ్రామంలోని వార్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సామాజిక ఆర్థిక సర్వేపై తుది విచారణ ఉంటుందని, సంబంధిత వ్యక్తులంతా హాజరుకావాలంటూ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.సంధ్యారాణి మంగళవారం నోటీస్ జారీ చేశారు. భూమి, ఇళ్లు కోల్పోయిన యజమానులకు సరైన పరిహారం చెల్లించడానికి ఈచట్టంలోని సెక్షన్ 16(4), 16(5) సెక్షన్ల కింద ఏర్పాటు చేసిన ఈగ్రామసభలో ఏమైనా సందేహాలు, సూచనలుంటే తెలపాలని అందులో కోరారు. విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, 61,134.5 చదరపు గజాల వ్యవసాయేతర భూమితో పాటు 12 మంది ఇళ్లు కోల్పోతున్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి ఇవ్వగానే మామునూరు విమానాశ్రయ నిర్మాణ కేంద్రం ప్రారంభిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఒక్కొక్కటి కొలిక్కిగా..
2024 డిసెంబర్ 1న ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. పరిహారం, భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో పారదర్శకత హక్కుల చట్టం, 2013లోని సెక్షన్ 11(1) ప్రకారం విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూమి సేకరిస్తోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు పలుదఫాలుగా సమావేశమైన డిస్ట్రిక్ట్ లెవల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ ఈ ఏడాది జూన్ 5న వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.1.20 కోట్లు, వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4,887గా నిర్ణయించారు. ఇంతకుమించి పెంచేది లేదని ఎకరాకు రూ.65 లక్షలకే నిర్ణయించాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సెంట్) అవార్డు కింద రూ.1.20 కోట్లు వరకు నిర్ణయించామని కలెక్టర్ సత్యశారద తేల్చి చెప్పడంతో 50 శాతానికిపైగా మంది తమ కన్సంట్‌ను రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఆగస్టులోపు మిగతా రైతులంతా తమ అంగీకారాన్ని తెలుపుతారని అధికారులు భావిస్తున్నారు. కొందరు మాత్రం ఇంకా ఎక్కువ ధర వస్తుందని ఆశపడుతున్నా, చివర్లో వారు కూడా ఇచ్చే అవకాశముంది. ఒకవేళ అంగీకరించకపోతే జనరల్ అవార్డు కింద వారి భూమి సేకరిస్తామని, వారు కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి అన్నారు.
మామునూరు విమానాశ్రయం కోసం ఇప్పటికే భూముల ధర ఫైనల్
ఇళ్లు, ఇతర ఆస్తులు కోల్పోతున్న వారితో 25న గ్రామసభ
ఖిలావరంగల్ మండలం
గాడిపల్లిలో సామాజిక ఆర్థిక సర్వే విచారణ
50 శాతానికిపైగా రైతులు కన్సెంట్ ఇచ్చారంటున్న రెవెన్యూ అధికారులు