
పంద్రాగస్టు నాటికి వీలైనన్ని భూ సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
వీడియో కాన్ఫరెన్స్
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 తేదీలోగా వీలైనన్ని వాటిని పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాదాబైనామా, సర్వే నంబర్ల మిస్సింగ్, అసైన్డ్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్, సక్సెషన్ దరఖాస్తులు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల పరీక్ష, ఇందిరమ్మ ఇళ్లపై దిశానిర్దేశం చేశారు. హనుమకొండకలెక్టరేట్‌నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని జిల్లా పరిస్థితులను వివరించారు. వీసీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్, డీఆర్‌డీఓ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఈఓ వాసంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆగస్టు 15వరకు పూర్తి చేస్తాం..
వరంగల్ కలెక్టరేట్ నుంచి వీసీలో కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాలో భూభారతిపై 57,850 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వాటిలో 25,000 సాదాబైనామా, 16,000 అసైన్డ్ భూముల దరఖాస్తులున్నాయని, మిగతావి క్లియర్ చేయాల్సి ఉందన్నారు. వాటిలో మిస్సింగ్ సర్వే నంబర్లు, సక్సెషన్ పెండింగ్ మ్యుటేషన్లు ఉన్నాయని, వాటన్నింటినీ విచారణ చేసి ఆగస్టు 15వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.