‘మోడల్‌’కు మోక్షమెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

‘మోడల్‌’కు మోక్షమెప్పుడో?

Jul 17 2025 3:08 AM | Updated on Jul 17 2025 3:08 AM

‘మోడల

‘మోడల్‌’కు మోక్షమెప్పుడో?

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరంలో అభివృద్ధి పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన మోడల్‌ మార్కెట్ల పనులు ఇంకా పూర్తికాలేదు. స్లాబ్‌, గోడలకే పరిమితమైనా బల్దియా ఇంజనీర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు లేకనే మార్కెట్ల నిర్మాణం ముందుకుసాగట్లేదు. బిల్లులిస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు మొండికేశారు.

8 మార్కెట్లలో సౌకర్యాలు కరువు..

రోడ్లకిరువైపులా, మురికి కాల్వల పక్కన, దుమ్ముధూళి నడుమ చేపలు, మాంసం, పండ్లు, కూరగాయలు, పూలను చిరువ్యాపారులు విక్రయిస్తున్నారు. నగరంలోని 8 మార్కెట్లలో కనీస సౌకర్యాలు లేవు అపరిశుభ్ర వాతావరణంలోనే విక్రయాలు కొనసాగుతున్నాయి. గత్యంతరం లేక ప్రజలు కొనుగోలు చేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నారు.

హనుమకొండ నక్కలగుట్టలో..

హనుమకొండ నక్కలగుట్టలోని ఇరిగేషన్‌ బోర్డు సర్కిల్‌ కార్యాలయ ఆవరణలోని రెండు ఎకరాల విస్తీర్ణంలో 131 స్టాళ్లకు సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. రూ.4.50 కోట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ 65 విడుదల చేసింది. ఈ నిధులతో నాలుగేళ్లలో మూడు స్లాబ్‌లు వేసి చేతులు దులుపుకున్నారు. సదుపాయాలు కల్పించేందుకు రూ.4.80 కోట్ల నిధులు కేటాయించాలని ఈఎన్‌సీకి నివేదించినట్లు బల్దియా ఇన్‌చార్జ్‌ ఈఈ సంతోశ్‌ తెలిపారు. ఈ నిధులు విడుదలైతేనే పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

వరంగల్‌ లక్ష్మీపురంలో..

సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ తర్వాత వరంగల్‌ లక్ష్మీపురంలోని కూరగాయలు, పండ్ల మార్కెట్‌ ప్రసిద్ధి చెందింది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు ఇక్కడి నుంచే హోల్‌సేల్‌ వ్యాపారులు కూరగాయలు, పండ్లు, పూలు సరఫరా చేస్తారు. పండ్ల మార్కెట్‌ స్థలంలో మోడల్‌ మార్కెట్‌ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్కెటింగ్‌ శాఖకు చెందిన 4.16 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 65 జీఓ, పట్టణ ప్రగతికి సంబంధించి రూ.24 కోట్ల నిధులు కేటాయించారు. 81 పూల దుకాణాలు, 60 మాంసం, చేపల దుకాణాలు, 105 కూరగాయల దుకాణాలు, ఒక అంతస్తులో మొత్తం హోల్‌సేల్‌ పండ్లు మార్కెట్‌ ఏర్పాటు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు డిజైన్‌ చేశారు. పనులు చేపట్టి ఏళ్లు గడిచినా స్లాబ్‌, గోడలకు మాత్రమే పరిమితమైంది. మరో ఏడాది గడిచినా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు వేగవంతమయ్యేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. ఈ విషయమై బల్దియా ఈఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇప్పటివరకు రూ.10 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, మరో రూ.14 కోట్లు కేటాయిస్తే నాలుగు నెలల్లో పనులు పూర్తిచేస్తామని తెలిపారు.

సమీకృత మార్కెట్లు, విస్తీర్ణం, కేటాయించిన నిధుల వివరాలు..

ప్రాంతం విస్తీర్ణం నిధులు కేటాయించిన దుకాణాలు

వెజ్‌ నాన్‌వెజ్‌ పూలు, పండ్లు

నక్కలగుట్ట 2 ఎకరాలు రూ.4.50 కోట్లు 59 44 28

లక్ష్మీపురం 4.16 ఎకరాలు రూ.24 కోట్లు 105 60 81

నాలుగేళ్లయినా పూర్తికాని మార్కెట్ల పనులు

బల్దియా ఇంజనీర్ల నిర్లక్ష్యం,

కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

అపరిశుభ్రత నడుమ చేపలు,

మాంసం, పండ్లు విక్రయాలు

అనారోగ్యం బారిన పడుతున్న

నగరవాసులు

మంజూరైనవి నాలుగు.. పనులు ప్రారంభించినవి రెండు

నగర జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు. 50 వేల జనాభాకు ఒక మార్కెట్‌ ఉండాలి. ఒకటి పెద్ద మార్కెట్‌ కాగా.. మధ్య, చిన్న తరహా మొత్తం 8 మార్కెట్లు మాత్రమే ఉన్నాయి. 2015లో అప్పటి సీఎం, పురపాలక శాఖ మంత్రి ఆదేశాలతో మోడల్‌ మార్కెట్లు నిర్మించాలని సూచించారు. స్థలాల అన్వేషణ కోసం సుమారు ఆరున్నరేళ్లు పట్టింది. వరంగల్‌ లక్ష్మీపురం, అండర్‌ రైల్వేగేట్‌ నాగమయ్య గుడి పక్కన, హనుమకొండ నక్కలగుట్ట, కాజీపేట జూబ్లీమార్కెట్‌ ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. ఏమైందో తెలియదు. తొలుత లక్ష్మీపురం, నక్కలగుట్టలో 2021 ఏప్రిల్‌లో మోడల్‌ మార్కెట్ల పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణ దశలో ఉండడంతో విమర్శలు వస్తున్నాయి.

‘మోడల్‌’కు మోక్షమెప్పుడో?1
1/1

‘మోడల్‌’కు మోక్షమెప్పుడో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement