
ప్లాస్టిక్ విక్రయిస్తే రూ.లక్ష జరిమానా..
● విధించాలని మేయర్, కమిషనర్ ఆదేశం
వరంగల్ అర్బన్ : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించే షాపు యజమానులకు రూ.లక్ష వరకు జరిమానా విధించడంతోపాటు రవాణా చేసే వాహనాలను, షాపులను సీజ్ చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌లు అధికారులకు సూచించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజారోగ్య విభాగం, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ అంశాలపై డీ స్లడ్జింగ్ ఆపరేటర్లతో మేయర్, కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 120 మైక్రాన్ కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ వాడితే పర్యావరణంతోపాటు మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్లాస్టిక్‌పై ఫిర్యాదులకు 14420 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుందన్నారు. బల్దియా పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో నగర అవసరాలకు అనుగుణంగా 150 కేఎల్‌డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం సిద్ధమైందన్నారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయించుకోవాలని సూచించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ సిబ్బందికి పీపీ కిట్లు అందజేశారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఆస్కి కోఆర్డినేటర్ రాజమోహన్‌రెడ్డి, శ్వేత, స్లడ్జింగ్ ఆపరేటర్లు, నగరంలోని వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు పాల్గొన్నారు.