
హనుమకొండ జిల్లాకు నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం అని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ పి.మధుసూదన్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాకు నాలుగు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, డిమాండ్‌కు అనుగుణంగా అవసరం ఉన్న మేరకు నూతన సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్య ఉండదని, రైతులకు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని స్పష్టం చేశారు. స్కాడా అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తామని, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
హజ్ యాత్రకు
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌యాత్ర–26కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు వరంగల్ జిల్లా హజ్ కమిటీ అధ్యక్షుడు సర్వర్ మోహియొద్దీన్ ఘాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుకు ఈనెల 31వరకు గడువుందన్నారు. పాస్‌పోర్ట్ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముస్లింలు హజ్‌కమిటీ.జీఓవీ.ఇన్ లేదా హజ్ సువిధ మొబైల్ యాప్‌లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాల కోసం 97044 49236 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వ్యాధులపై
అవగాహన కల్పించాలి
డీఎంహెచ్‌ఓ అప్పయ్య
హసన్‌పర్తి: ప్రస్తుత సీజన్‌లో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య సూచించారు.. హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి, సిద్ధాపురంల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. బాలింతలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందుతున్న సేవలను తెలుసుకోవడమే కాకుండా పలు సూచనలు చేశారు. ప్రతీ ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రంల్లో స్వచ్ఛదనం–పచ్చదనం పాటించాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆయనవెంట సిద్ధాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీపాల్, డాక్టర్ నవత, సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
సీనియార్టీ జాబితా
రూపకల్పన
నేడు సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్స్ పరిశీలన
2002 డిసెంబర్ 31 వరకు కటాఫ్
విద్యారణ్యపురి: రాష్ట్రంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో త్వరలోనే స్కూల్ అసిస్టెంట్లకు పీజీహెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు మల్టీజోన్–1లో వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిధిలో 19 జిల్లాల్లో అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ల సీనియార్టీ లిస్టులను రూపొందిస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి.. డీఈఓలకు సీనియార్టీ లిస్టులను సిద్ధం చేసుకోవాలని ఇటీవల ఆదేశించినట్లు సమాచారం. ఈమేరకు 2002 డిసెంబర్ 31 వరకు స్కూల్ అసిస్టెంట్లుగా నియామకమై విధులు నిర్వర్తిస్తున్న వారిని కటాఫ్ డేట్‌గా నిర్ణయించి సీనియార్టీ లిస్టులను రూపొందించుకుని సిద్ధం చేసుకోవాలని ఆర్జేడీ డీఈఓలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో హనుమకొండ జిల్లాలో 2002 డిసెంబర్ 31 వరకు అన్ని సబ్జెక్టులు కలిపి సుమారు 350 మంది స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నట్లుగా గుర్తించారు. వీరికి ఈనెల 11న ఉదయం 10గంటలకు సర్వీస్ బుక్స్‌ను, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు డీఈఓ డి.వాసంతి సంబంధిత స్కూల్ అసిస్టెంట్లకు మెసేజ్‌ల రూపంలో గురువారం పంపారు. హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన 8 కౌంటర్లను ఏర్పా టు చేశారు. త్వరలోనే పదోన్నతులకు షెడ్యూ ల్ రానున్నట్లు ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

హనుమకొండ జిల్లాకు నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్లు