
ఆర్వోబీ పనులు వేగంగా పూర్తి చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
కాజీపేట: కాజీపేట ఆర్వోబీ పనుల్ని మరింత వేగంగా చేసి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కాజీపేటలో నిర్మాణంలో ఉన్న ఆర్వోబీ పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే అంశంపై అధికారులతో చర్చించి పలు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేశ్‌బాబు కలెక్టర్‌కు వివరించారు. 72 మీటర్ల బోస్ట్రింగ్ గడ్డర్స్ పనులు పూర్తి చేశామని, త్వరలో మిగతా పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఆర్డీఓ రమేశ్ రాథోడ్, తహసీల్దార్ భావుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
13న పరీక్ష
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలి
విద్యారణ్యపురి: సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్నవారు హాల్‌టకెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అధ్యయన కేంద్రం గౌరవ సంచాలకులు కె.జగన్‌మోహన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలో అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌స్టడీసర్కిల్.కో.ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేసి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ పదినెలలు అందిస్తారని తెలిపారు.