
ఇళ్ల నిర్మాణంలో ప్రగతి కనిపించాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పనుల పురోగతిని పరిశీలించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో ఇళ్ల నిర్మాణం, రేషన్‌కార్డుల వెరిఫికేషన్, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవంలో నాటే మొక్కల ప్రగతి, ఏర్పాట్లు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8,750 ఇళ్లు మంజూరు కాగా.. 4,806 గ్రౌండింగ్ అయ్యి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. సమీక్షలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, గృహ నిర్మాణ పీడీ గణపతి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు.
పీఎం విశ్వకర్మ యోజనపై సమీక్ష
ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన, తెలంగాణ ఐపాస్, జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీ మీటింగ్‌లో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా వృత్తిదారులకు మద్దతుగా పీఎం విశ్వకర్మ యోజన అమలు, లబ్ధిదారులకు శిక్షణ, ఆర్థిక సాయం, టూల్ కిట్ల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.