
‘సూపర్ స్పెషాలిటీ’ పనులు పూర్తిచేయాలి
ఎంజీఎం: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆయా క్లినికల్ విభాగాల్లో వసతులు కల్పించేందుకు పూర్తి వివరాలతో కూడిన సూక్ష్మ ప్రణాళిక నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని పేర్కొన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యాధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పిడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, పాథాలాజీ, ఫోరెన్సిక్, అనస్థీషియా, ఆర్థోపెడిక్ తదితర క్లినికల్ విభాగాలకు ఏ భవనాల్లో గదులు కేటాయించారు, ఇంకా మిగిలిన విభాగాలకు ఏ అంతస్తుల్లో గదులు కేటాయించాలి, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అనంతరం ఆస్పత్రిలో నిర్మాణమవుతున్న 24 అంతస్తుల్లో పలు అంతస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు కీలక అంశాలపై నిర్మాణ ప్రతినిధులకు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూక్ష్మ ప్రణాళికలు సిద్ధం చేస్తే ఆయా శాఖలకు కేటాయించాల్సిన వనరులు, వసతులు కల్పించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న వివిధ పరికరాలను ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. వీటికి అదనంగా కొత్త పరికరాలను సంబంధిత శాఖ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, ఎల్‌అండ్‌టీ అధికారి శరవరన్, జిల్లా ఆర్‌అండ్‌బీ అఽధికారి రాజేందర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ డీఈ, ఆర్‌ఎంఓలు, అధికారులు పాల్గొన్నారు.
ఆస్పత్రిలో వసతుల కల్పనకు
సూక్ష్మప్రణాళిక నివేదిక సమర్పించాలి
అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద