
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి
వరంగల్ క్రైం: నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. జూన్‌కు సంబంధించిన నెలవారీ నేర సమీక్షను కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉండడానికి కారణాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు అర్బన్, మున్సిపల్, గ్రామ స్థాయిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో విలేజ్ పోలీస్ అఫీసర్‌ను ఏర్పాటు చేయాలని, నేరాల నియంత్రణకు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉదయం 6 గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ అధికారులు సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో రోడ్డు ప్రమాదాలకు కారణాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష జరపాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత పోలీసులకు చిక్కినప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించి చికిత్స అందించేందుకు కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని వివరించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులకు అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, ఏఎస్పీలు శుభం, చేతన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, బోనాల కిషన్, రవి, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సీపీ సన్‌ప్రీత్ సింగ్
కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష