
రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేస్తే జరిమానా
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. క్షేత్రస్థాయిలో తనిఖీ
వరంగల్ అర్బన్: ఇళ్లల్లో, షాపుల్లో వెలువడిన చెత్తను విధిగా స్వచ్ఛ ఆటోలు, వాహనాలకు అందించేలా చూడాలని, నిర్లక్ష్యంగా డ్రెయినేజీల్లో, రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ పరిధి 31, 7, 8 డివిజన్లలో శానిటేషన్ తనిఖీలు చేపట్టారు. వడ్డేపల్లి బండ్‌పై స్మార్ట్ సిటీ పనులు, ప్రశాంత్ నగర్‌లోని 15 ఏంఎల్‌డీ సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హనుమకొండ మెయిన్ రోడ్డు, చౌరస్తా ప్రాంతాల్లో పర్యటించి గ్రీవెన్స్‌లో స్థానికులు అందించిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేసిన టీ స్టాల్ యజమానికి రూ.10 వేలు పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, హెచ్‌ఓ రమేశ్, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ మేనక, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.