
వెల్లువెత్తిన వినతులు
వరంగల్ అర్బన్ : ‘మా సమస్యలు అంటే బల్దియా అధికారులకు, సిబ్బందికి చులకనైంది’అని పలు కాలనీల ప్రజలు సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా పరిష్కారం కావడం లేదని, ఈ వినతుల స్వీకరణ ఎందుకు? అంటూ నిరసన వ్యక్తం చేశారు. భారీగా చేరుకున్న ఫిర్యాదుదారులతో బల్దియా కార్యాలయం అంతా కిక్కిరిపోయింది. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, ప్రతీ వినతిపై వివరణాత్మక నివేదిక అందించాలని కమిషనర్.. అధికారులకు సూచించారు. జవాబు దారీగా ఉండాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 109 ఫిర్యాదులు రాగా, అందులో ఇంజనీరింగ్ సెక్షన్‌కు 26, హెల్త్ – శానిటేషన్ 14, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)13, టౌన్ ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా 6, హార్టికల్చర్ 1 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్‌ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్‌ఓ డా.రాజేశ్, హెచ్‌ఓ రమేశ్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని ఇలా..
● వరంగల్ పాతబీట్ బజార్‌లో వర్షపునీరు, మురుగు నీటితో పాదచారులు, వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం చూపించాలని వ్యాపారులు కోరారు.
● మడికొండ మా హిల్స్ కాలనీలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించి చేపట్టిన పనులు వెంటనే నిలిపేసి, చర్యలు తీసుకోవాలని సుమారు 60 మంది కాలనీవాసులు బల్దియా ఎదుట నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం అందజేశారు.
● రంగశాయిపేట 19–1–146 పాడుబడిన భవనం, సమీపంలోని ఖాళీ స్థలాల్లో చెట్లు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● వరంగల్ డాక్టర్స్ కాలనీ హనుమాన్ నగర్‌లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనా పట్టించుకోడం లేదని, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
● దేశాయిపేట సర్వేనంబర్ 326లో 20 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
● 45వ డివిజన్ కుమ్మరిగూడెం బల్దియా 13వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని, 2 ఫీట్లు పగులగొట్టి పైపులైన్ వేశారని, ఆ స్థలాన్ని సమీప ఇళ్లవాసులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్ని విన్నవించారు.
● రంగశాయిపేటలో ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, విషజ్వరాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
● హనుమకొండ అశోక కాలనీలో సెల్ టవర్‌కు అనుమతులు రద్దు చేయాలని కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ ప్రతినిధులు విన్నవించారు.
● కాజీపేట కడిపికొండ బ్రిడ్జికి ఎదురుగా గల్లీలో డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోందని, చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విన్నవించారు.
● గోపాలపురం అరుణోదయ కాలనీలో హై టెన్షన్ వైర్ల కింద భవన నిర్మాణం చేపడుతున్నారని, గతేడాది ఓ వ్యక్తి మృతి చెందాడని నిబంధన మేరకు నిర్మాణం చేపట్టడం లేదని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
● రంగశాయిపేట శంభునిపేట జంక్షన్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
● 31వ డివిజన్ హంటర్ రోడ్డు హిల్స్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు వినతి పత్రం అందించారు.
● 2వ డివిజన్ రెడ్డికాలనీలో 33 ఫీట్ల రోడ్డు ఉందని, కొలతలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నట్లు, నిబంధనల మేర చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు.
● భీమారం శ్యామల చెరువు మత్తడి 33 ఫీట్ల మేరకు ఉండగా, చాలావరకు కబ్జాకు గురైందని, వర్షం వస్తే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని, ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు కోరారు.
● 65వ డివిజన్ ఎల్లాపూర్‌లోని ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తునారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.
● 48వ డివిజన్ దర్గా కాజీపేటలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కారు షెడ్డును తొలగించాలని కాలనీవాసులు విన్నవించారు.
● న్యూశాయంపేటలో బీజేపీ ఆఫీస్ వెనుక సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు వినతిపత్రం అందించారు.
● హనుమకొండ కాంగ్రెస్ భవన్‌నుంచి బుద్ధభవన్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు.
కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్
పరిష్కారం చూపకపోతే ఎందుకు
స్వీకరిస్తున్నారని ఆందోళన
దరఖాస్తులను స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్,
వింగ్ అధికారులు

వెల్లువెత్తిన వినతులు