
డీటీ రాజేశ్ ఖన్నా కన్నుమూత..
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
● మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ
నల్లబెల్లి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాజేశ్ ఖన్నా(50) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఎంజీఎంలో మృతి చెందారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. హనుమకొండ ప్రశాంత్ నగర్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అన్నబోయిన రాజేశ్‌కన్నా(50) ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పని చేయడం లేదని నిర్ధారించారు. దీంతో భార్య రమాదేవి తన కిడ్నీ దానం చేసి భర్తను బతికించుకుంది. ఈ క్రమంలో వైద్యం కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది తండ్రి, రెండు నెలల క్రితం తమ్ముడు మృతి చెందాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం డీటీ రాజేశ్ కన్నా ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురు బంగారు ఆభరణాలు అమ్మి సుమారు రూ.25 లక్షలతో చికిత్స చేయించారు. అయితే ఇంకా అదే ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేతిలో డబ్బులు లేవు. దీంతో డిశ్చార్జ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య రమాదేవి విలపిస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో తన గోడు వెల్లబోసుకుంది. దీంతో వారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చించి మెరుగైన వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కృత్రిమ శ్వాసతో కోలుకుంటున్న క్రమంలో ఆదివారం రాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డిప్యూటీ తహసీల్దార్ మృతితో నల్లబెల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, డీటీ రాజేశ్‌కన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ..
డిప్యూటీ తహసీల్దార్ మృతి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ స త్యశారద.. రాజేశ్ ఖన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందించారు. నివాళులర్పించిన వారి లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు పాక రమేశ్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, నాగేశ్వరరావు, మంజుల, తదితరులు పాల్గొన్నారు.