
అమ్మవారికి విరోధిని, వహ్నివాసిని క్రమాలలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా.. సోమవారం ఐదో రోజు అమ్మవారికి విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రీమాతా, లలితాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. మట్వాడ సీఐ గోపీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ఆలయ ధర్మకర్తలు తొనుపూనూరి వీరన్న, నార్ల సుగుణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.