
పోలీసుల అదుపులో నిందితులు?
● ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు
కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో శుక్రవారం ఫైనాన్స్ వ్యాపారి త్రిపురాధి నవీన్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత నిందితులు అతడి(నవీన్‌కుమార్) శరీరంపై ఉన్న బంగా ర ఆభరణాలను తీసుకుని వరంగల్ బట్టల బజారులోని ఓ జ్యువెల్లరీ షాపులో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు ఇద్దరు కాజీపేటలోని ఓ చిరువ్యాపారిని కలిసి తమ ఫోన్ పోయిందని చెప్పి మరొకరితో మాట్లాడినట్లు కేసు విచారణలో బయట పడింది. దీంతో నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆ రోజు డబ్బుల వసూలు కోసం వచ్చి సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే చంపినట్లు నిందితుడు ప్రవీణ్‌కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఏమి తెలియనట్లు ఉండాలని భావించామని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విషయం బహిర్గతం అయ్యిందని కన్నీరు పెట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డబ్బులు సాయం చేసిన వ్యాపారిని హత్య చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అతడి ప్రవర్తన వల్లే మద్యం మత్తులో హత్య చేసినట్లు నిందితులు పోలీసు అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం వరంగల్‌లో బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత మేర బాకీలు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
నవీన్‌కుమార్(ఫైల్)