
ప్రతీ పేదోడికి సొంతిల్లు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: ప్రతీ పేదోడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 800 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రొసీడింగ్స్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 2 వేల మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. త్వరలో 1,500 మందికి ప్రొసీడింగ్స్ అందించనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికై నా లంచం ఇస్తే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ కార్పొషన్ పీడీ సిద్ధార్థ నాయక్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రజాలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా కేంద్రం కులగణన..
తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే గ్రామస్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారన్నారు. సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్‌గౌడ్, మోత్కూరి ధర్మారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.