
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్‌గా ఫోకస్ పెట్టండి
● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్
వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో వార్త క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, హెచ్‌ఓ రాజేశ్‌తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలోని వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. ఈసందర్భంగా కమిషనర్ పలు సూచనలిచ్చారు. త్వరితగతిన యూజర్ చార్జీల పరిధిలోకి వచ్చే వాణిజ్య సంస్థలన్నీంటినీ గుర్తించి చార్జీలు వసూలు చేయాలన్నారు. ప్రతి నెలా వసూలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సంస్థ నుంచి చెత్తను విధిగా వాహనాల్లో సేకరించి తరలించాలని ఆదేశించారు. ఈవిషయంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు.