
బాలల సంరక్షణకు పనిచేయాలి
● అడిషనల్ డీసీపీ రవి
వరంగల్ క్రైం: బాలలను సంరక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ డీసీపీ రవి సూచించారు. జులై 1 నుంచి నెలరోజులు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–11వ విడత కార్యక్రమంపై అదనపు డీసీపీ ఆధ్వర్యంలో శనివారం కమిషనరేట్‌లో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫిక్ విభాగంతో పాటు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098 విద్యాశాఖ, కార్మిక శాఖ చెందిన అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ రవి మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు పిల్లల్ని ఎవరైనా హింసించినా, భిక్షాటన చేయించినా, పిల్లల్ని బాల కార్మికులుగా మార్చినా అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ హెచ్చరించారు. ఈసందర్భంగా ఆపరేషన్ ముస్కాన్‌పై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హాజరైన అన్ని శాఖల ప్రతినిధులతో ఆపరేషన్ ముస్కాన్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.