
విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబర్చాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్ : గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ పట్టణంలోని హంటర్‌రోడ్డులో గల ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని సదుపాయాలు, చెత్త, మరుగుదొడ్ల నిర్వహణ, సీజనల్ జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి ఫలితాల వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారిని పలు ప్రశ్నలు అడిగారు. గురుకుల సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహారం, తాగునీరు, కిచెన్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్, హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం, అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.