
పెద్దపల్లి రైల్వే వంతెన ఘటనతో రైళ్లకు అంతరాయం
కాజీపేట రూరల్: పెద్దపల్లి రైల్వే వంతెన (ఆర్వోబీ) ఘటనతో శుక్రవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్–బల్లార్షా రూట్‌లో ప్రయాణించే పలు రైళ్లకు గంటల తరబడి ఆలస్యం తలెత్తింది. బల్లార్షా–సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్, సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్‌సిటీ, సికింద్రాబాద్– దానాపూర్ వెళ్లే ధానాపూర్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయం కన్నా గంటల తరబడి ఆలస్యంగా చేరుకున్నాయి. దానాపూర్‌ను ఘన్‌పూర్ స్టేషన్‌లో నిలిపివేయడంతో కాజీపేటకు గంట ఆలస్యంగా చేరుకుంది. అదేవిధంగా న్యూడిల్లీ– హైదరాబాద్ వెళ్లే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు, కాగజ్‌నగర్– సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్‌సిటీ 2 గంటలు, కాగజ్‌నగర్– సికింద్రాబాద్ వెళ్లే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ 2:30 గంటలు రీ షెడ్యూల్ చేసినట్లు, భద్రాలచంరోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే సింగరేణి ప్యాసింజర్‌ను వరంగల్ వరకే అప్ అండ్ డౌన్ రూట్‌లో నడిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యం, రీ షెడ్యూల్‌తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, కాజీపేట రైల్వే చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్‌కుమార్, కాజీపేట రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ అరుణ్ ప్రయాణికులకు రైళ్ల రాకపోకలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు.
ఉప్పల్‌లో ఐదు గంటలు నిలిచిన ఇంటర్‌సిటీ..
కమలాపూర్: హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సుమారు ఐదు గంటలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఉప్పల్‌కు సుమారు 8–30 గంటలకు చేరుకుందని తెలిపారు. గంట, రెండు, మూడు, నాలుగు గంటలు గడిచినా రైలు ముందుకు కదలకపోవడంతో రైల్వే అధికారులను అడిగితే పెద్దపల్లి వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో గడ్డర్లు అమరుస్తున్న క్రమంలో ఓ గడ్డర్‌కు సంబంధించిన వస్తువు కిందకు జారిందని, దీంతో ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపి వేశారని చెప్పినట్లు తెలిపారు. చివరికి మధ్యాహ్నం 1–30 ప్రాంతంలో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు కదిలింది.
తెలంగాణ రీ షెడ్యూల్, సింగరేణి
వరంగల్ వరకే
ఇబ్బంది పడ్డ ప్రయాణికులు