
ఇంకా పునాదుల్లో నే!
సాక్షి, వరంగల్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో చేపట్టిన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం నాటి ఆర్‌సీసీ ఫ్రేమ్‌డ్ స్ట్రక్చర్‌తో నిర్మించిన వరంగల్ పాత బస్టాండ్‌ను కూల్చివేసి.. ఆ స్థానంలో నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నిర్మాణ పనులు ఇంకా ఫుటింగ్ దశలోనే ఉన్నాయి. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగించి, రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో పునాదులు తవ్వి నిర్మిస్తున్నారు. మట్టిని చదును చేసి పునాది కోసం కాంక్రీట్ వేయడానికి ముందు బ్లైండింగ్ కాంక్రీట్ పొర వేస్తున్నారు. కాంక్రీట్ వేసిన తర్వాత, రాడ్లు అమర్చి కావాల్సిన మందంతో స్లాబ్ నిర్మించనున్నారు. ఇలా రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్లు నిర్మించేందుకు రెండేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా కాంట్రాక్ట్ కాలపరిమితి 18 నెలల్లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ పనులను వేగవంతం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఊటతో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఫుటింగ్ పనుల్లో వేగిరం పెంచారు. ఇవన్నీ పరిశీలిస్తే బస్టాండ్ నిర్మాణానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు.
మరో రూ.50 కోట్లు అవసరం..
అన్ని జిల్లాలు, రాష్ట్రాల బస్సులతోపాటు సిటీ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకునేలా గ్రౌండ్ ఫ్లోర్‌లో 32 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. మరో ఐదు అంతస్తుల్లో వ్యాపార, వినోదం తదితర వసతులు ఉండేలా కాంప్లెక్స్‌లు అందుబాటులోకి తేనున్నారు. సెల్లార్‌లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, వరంగల్ రైల్వే స్టేషన్, నియోకు అనుసంధానంగా వరంగల్ బస్టాండ్ ఉండేలా.. అండర్ వాక్ లేదంటే స్కైవాక్ నిర్మించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ కోసం కేటాయించిన రూ.75 కోట్లతోపాటు మరో రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న నిధులతో రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసి బస్సు సర్వీసులు నడిచేలా చూడనున్నారు. ఇది ఏడాదిన్నరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఆతర్వాత వచ్చే నిధులతోనే పైఅంతస్తులు నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. ఇలా పూర్తిస్థాయిలో వరంగల్ బస్టాండ్ అందుబాటులోకి రావాలంటే మూడేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశముంది. ‘ఈ బస్టాండ్ నిర్మాణ పనులు పునాది దశల్లో ఆలస్యం అవుతాయి. రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ వరకు నిర్మాణ పనులు నిర్ణీత కాలపరిమితి 18 నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. కాంట్రాక్టర్‌కు మార్గదర్శనం చేస్తూ సాధ్యమైనంత తొందరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు తెలిపారు.
ప్రయాణికులకు తిప్పలే..
వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణికుల సౌకర్యార్థం సమీపంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్షం పడితే అక్కడ కూడా నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారీ వర్షం కురిస్తే తడుస్తారు. ఇలా కాలం ఏదైనా వరంగల్ ఆధునిక బస్టాండ్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులతోపాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.
నిదానంగా వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు
రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం
గుంతల్లో నీటిఊట రాకుండా
ఫుటింగ్ వర్క్
18 నెలల్లో పూర్తిచేస్తామంటున్న ‘కుడా’ అధికారులు
అప్పటివరకు తాత్కాలిక
బస్టాండ్‌లోనే సేవలు

ఇంకా పునాదుల్లో నే!