టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Jun 28 2025 5:21 AM | Updated on Jun 28 2025 7:16 AM

టెన్త

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

హనుమకొండ జిల్లాలో 89.95%,

వరంగల్‌ జిల్లాలో 60.73% ఉత్తీర్ణత

విద్యారణ్యపురి: ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని శుక్రవారం విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 416 మంది 89.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. బాలురు 277 మందికి 249 మంది, బాలికలకు 186 మందికి 167 మంది ఉతీర్ణులైనట్లు పేర్కొన్నారు. వరంగల్‌ జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై

లోకాయుక్తలో ఫిర్యాదు

ఎంజీఎం: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్‌, డీమ్డ్‌ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్‌ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు డీమ్డ్‌ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్‌ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్‌ తెలిపారు.

మధ్యవర్తిత్వ ప్రత్యేక

గవర్నమెంట్‌ ప్లీడర్‌గా వాణి

వరంగల్‌ లీగల్‌: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్‌ ప్లీడర్‌ (స్పెషల్‌ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

‘పద్మ’ అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌ స్పోర్ట్స్‌: గణతంత్ర (జనవరి 26) దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు, అందుకు సంబంధించిన పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, నాలుగు సెట్లను రూపొందించి జూలై 25లోగా హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. అంతేకాకుండా www:https://padmaawards.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు.

బాలల సంరక్షణే లక్ష్యం

కాజీపేట అర్బన్‌: బాలల రక్షణే లక్ష్యంగా బాలల సంరక్షణ కేంద్రాలు పని చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, ఫాతిమానగర్‌లోని డివైన్‌ మెర్సీ, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను శుక్రవారం అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి ఇన్‌స్పెక్షన్‌ కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలని, భవనాలకు ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంస్థల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ అన్నమనేని అనిల్‌చందర్‌రావు, సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్‌, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ప్రవీణ్‌కుమార్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ మౌనిక తదితరులు పాల్గొన్నారు.

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల1
1/1

టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement