
పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
హన్మకొండ: పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈక్రమంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి రాయితీని అందిస్తోంది. హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని, 3,19,900 పట్టు గుడ్ల ద్వారా 2,30,328 పట్టు కాయల ద్వారా 38,388 కిలోల పట్టుదారాన్ని ఉత్పత్తి చేయాలని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 81 ఎకరాలను మల్బరీ తోట పెంపకానికి గుర్తించారు. జిల్లాలో 8 మండలాల్లో 51 గ్రామాల్లో 97 మంది పట్టు పరిశ్రమ నిర్వహిస్తున్నారు.
రాయితీ వివరాలు..
పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేలు సహాయాన్ని రాయితీ రూపేణా అందిస్తోంది. పట్టు పురుగుల పెంపకానికి గది నిర్మాణానికి రూ.2.25 లక్షలు, స్టాండ్స్, ఇతర పరికరాలకు రూ.37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ.2,500, నీటి పారుదల కోసం రూ.50 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మల్బరీ తోట నాటుట, నిర్వహణకు రూ.41,500, షెడ్డు నిర్మాణానికి 1,03,040 చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78 వేలు, షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, రేరింగ్ పరికరాలకు రూ.26,610, రేరింగ్ స్టాండ్స్‌కు 24,140, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారాలకు రూ.3,250, నీటి పారుదల సదుపాయానికి రూ.65వేలు రాయితీగా చెల్లిస్తోంది.
రాయితీ అందిస్తున్న కేంద్రం
హనుమకొండ జిల్లాలో
202 ఎకరాల్లో మల్బరీ సాగు
ఈ ఏడాది అదనంగా
175 ఎకరాల్లో సాగు లక్ష్యం