
రహదారుల భద్రతపై తనిఖీలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్ : రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆర్‌అండ్‌బీ, పోలీస్, జాతీయ రహదారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రహదారుల భద్రత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో రద్దీ, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి సంబంధింత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కటాక్షపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియంతో కూడిన సైన్ బోర్డులు, ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను అందజేయాలన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని, నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల, మ్యాన్‌హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్ బాబు, నేషనల్ హైవేస్ ఈఈ మనోహర్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్‌రాథోడ్, నారాయణ, అడిషనల్ ఏసీపీ ప్రభాకర్‌రావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.