
మహిళా డెయిరీ ఏర్పాటుకు సత్వర చర్యలు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు సత్వరమే చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో శుక్రవారం డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, అధికారులతో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సమీక్షించారు. ఈసందర్భంగా పరకాల మహిళా డెయిరీ భవన నిర్మాణం, పాల సేకరణ, డెయిరీ ద్వారా పాల సరఫరా, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మిల్క్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, సొసైటీ ఏర్పాటు, మార్కెటింగ్, చెల్లింపులు, తదితర అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, సహకార అధికారులు సంజీవరెడ్డి, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.