
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
ఉద్యాన విభాగాధికారులతో మేయర్ సమీక్ష
వరంగల్ అర్బన్: నగర పరిధిలో నిర్వహించే వన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో ఉద్యాన వన విభాగాధికారులతో వన మహోత్సవంపై సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధిలో 12 రకాల మొక్కలు, చామంతి గులాబీ పండ్ల మొక్కలు, హోం స్టేడ్ మొక్కల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు కావాల్సిన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమాల అమలులో భాగంగా నియోజకవర్గాల్లో పార్కులను గుర్తించాలన్నారు. బల్దియా పరిధిలోని నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు గుర్తించాలన్నారు. అదేవిధంగా నాగమయ్య కుంట ప్రాంతాన్ని ఫెన్సింగ్ చేసి వివిధ రకాల మొక్కలతో అలంకారంగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో ఉద్యానవన అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.